నైరోబి, సెప్టెంబర్ 11: దేశంలోని అనేక నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను హస్తగతం చేసుకున్న ఆదానీ సంస్థ విదేశాలకు విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. కెన్యాలో అదానీ సంస్థకు వ్యతిరేకంగా వందలాది మంది ఎయిర్‌పోర్టు కార్మికులు ఆందోళనకు దిగారు. రాజధాని నైరోబిలోని జోమో కెన్యట్ట అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(జేకేఐఏ) అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రాత్రి కెన్యా ఏవియేషన్ అథారిటీ(కేఏఏ) కార్మికులు సమ్మెకు దిగారు.
‘అదానీ.. గోబ్యాక్’, ‘వీ రిజెక్ట్ అదానీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదానీతో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కార్మికుల సమ్మెతో ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. టెర్మినల్ బయట ప్రయాణికులు బారులు తీరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ఈ ఒప్పందంపై అభ్యంతరాల నేపథ్యంలో కెన్యా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
ఏమిటీ ఒప్పందం?
జోమో కెన్యట్ట అంతర్జాతీయ విమానాశ్రయం కెన్యాలో ప్రధానమైనది. దాదాపు 185 కోట్ల డాలర్లకు ఈ ఎయిర్‌పోర్టును 30 ఏండ్ల పాటు అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు కెన్యా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సామర్థ్యానికి మించి ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు వస్తున్నందున ఆధునీకరించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్టు కెన్యా ప్రభుత్వం చెప్పింది. ఒప్పందంలో భాగంగా అదానీ సంస్థ రెండో రన్‌వేను నిర్మించడంతో పాటు ప్రయాణికుల టెర్మినల్‌ను ఆధునీకరించాలి. అయితే, పబ్లిక్ టెండర్‌ను ఆహ్వానించకుండా అదానీ సంస్థ చేసిన ప్రతిపాదన ఆధారంగా ఈ ఒప్పందం ఖరారైంది.
ఒప్పందాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు?
నైరోబీ ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించేందుకు కెన్యా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రహస్యంగా ఉంచుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. అన్ని వివరాలను ప్రభుత్వం తమకు ఇవ్వడం లేదని, ఎందుకు ఒప్పంద వివరాలను రహస్యంగా ఉంచుతున్నారని కెన్యా ఏవియేషన్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ జనరల్ మోసెస్ ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు ప్రభుత్వ ఆస్తి అని, కెన్యా ప్రజలకు నిజాలు తెలియాలని కినాంగాప్ ఎంపీ క్వెన్యా థుకు పేర్కొన్నారు.
రాయితీల ద్వారా ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు సాగుతున్నాయని, ఇప్పుడు ఆదానీ సంస్థకు ఎయిర్‌పోర్టును అప్పగిస్తే స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారని, లాభాల కోసం ఈ సంస్థ ప్రయాణికులను దోచుకుంటుందని ఎయిర్‌పోర్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. ‘ఇది మా సార్వభౌమత్వాన్ని ఆపహాస్యం చేయడమే. అదానీ సంస్థ ఒట్టి చేతులతో వస్తున్నది. మేము అదానీని తిరస్కరిస్తున్నాం’ అని వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ లీజు ఒప్పందాన్ని లా సొసైటీ ఆఫ్ కెన్యా, కెన్యా మానవ హక్కుల కమిషన్ కోర్టులో సవాల్ చేశాయి. ఒప్పందంపై తాత్కాలిక స్టే విధించిన కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.
మొన్న ఆస్ట్రేలియా, శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు కెన్యా
గత పదేండ్లుగా భారత్‌లో అనేక రంగాలకు వ్యాపారాన్ని విస్తరించిన అదానీ సంస్థలు విదేశాల్లోనూ అడుగుపెట్టాయి. పలు దేశాలతో ఇంధన, విద్యుత్తు, మైనింగ్, విమానాశ్రయాలకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అయితే, ఈ ఒప్పందాలపై ఆయా దేశాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో నిర్మించాలనుకున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై అక్కడి ప్రజలు భగ్గుమన్నారు. 2022లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు ఇదీ ఓ కారణం. అదానీ నుంచి విద్యుత్తు కొనుగోలు కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, దీనిపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతకుముందు ఆస్ట్రేలియాలోనూ అదానీ మైనింగ్ ప్రాజెక్టుపై ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు కెన్యాలోనూ ఇదే జరుగుతున్నది.