వాషింగ్టన్, జనవరి 3: మీరు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలా? ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు మీ దరి చేరకుండా ఉండాలా? అయితే ప్రతిరోజూ సరిపడా నీళ్లు, పానీయాలు తాగితే సరిపోతుందంటున్నారు అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) పరిశోధకులు. ఎవరైతే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకొంటారో వారు ఎలాంటి వ్యాధులబారిన పడకుండా దీర్ఘకాలం బతికేస్తారని వారి అధ్యయనంలో తేలింది. 11,255 మంది వయోజనులపై పరిశోధకులు 30 ఏండ్లపాటు అధ్యయనం నిర్వహించారు. ద్రవ పదార్థాలు తక్కువ తీసుకొన్నప్పుడు పెరిగిపోయే సీరం సోడియం లెవల్స్తోపాటు ఇతర కారకాలను పరిశీలించారు.
ఆ డాటాను విశ్లేషించారు. రోజులో తక్కువ నీళ్లు తాగుతున్న వయోజనులతో పోల్చితే సరిపడా నీళ్లు తాగుతున్న వయోజనులు గుండె, ఊపిరితిత్తుల సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో తక్కువగా బాధపడుతున్నట్టు తేల్చారు. వారి జీవితకాలం పెరుగడంతోపాటు వృద్ధాప్య ఛాయలు దరిచేరడం లేదని కనుగొన్నారు. అలాగే, రోజులో సరిపడా నీళ్లు తాగని వయోజనుల్లో సీరం సోడియం లెవల్స్ పెరిగిపోయి తక్కువ వయసులోనే కన్నుమూస్తున్నట్టు తేల్చారు.