Kamala Harris | వాషింగ్టన్, నవంబర్ 6: దశాబ్దం క్రితం కమలా హారిస్‌ను ఒక జర్నలిస్టు ‘లేడీ ఒబామా’గా అభివర్ణించాడు. ఈ ఎన్నికల్లో ఆమె అధ్యక్షురాలిగా విజయం సాధించి శ్వేత సౌధంలో అడుగుపెడతారని భావించిన నల్లజాతి, భారతీయ వలస తల్లిదండ్రుల ఆశలు నెరవేరలేదు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం సాధించకపోయినా, రాజకీయాల్లో తమకు ద్వారాలు మూసుకుపోలేదన్న విశ్వాసాన్ని మహిళల్లో పాదుకొల్పారు.
ముఖ్యంగా మహిళల్లో ఆమె స్ఫూర్తి, ఎనలేని ధైర్యాన్ని ఇచ్చారు. ఒక వేళ ఆమె ఈ ఎన్నికల్లో నెగ్గి ఉంటే తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించేవారు. అమెరికాకు తొలి ఉపాధ్యక్షురాలిగా సేవలందించిన 60 ఏండ్ల కమల తండ్రి నల్ల జాతీయుడు కాగా, తల్లి భారతీయురాలు.
ఆమె తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకాకు చెందిన వారు. చెన్నై నుంచి అమెరికాకు 1958లో వలస వచ్చిన ఆమె తల్లి శ్యామల గోపాలన్‌ను ఆయన వివాహం చేసుకున్నాడు. కమల 2017లో తొలిసారిగా యూఎస్ సెనేట్‌కు ఎన్నికయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఆమె పూర్వపు ఉపాధ్యక్షుల మాదిరిగా కాకుండా బైడెన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.