వాషింగ్టన్: సిక్కు తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసుపై కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో(Justin Trudeau) స్పందించారు. ఆ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఫైవ్ ఐస్ భాగస్వామ్య దేశాలతో పంచుకున్నట్లు ఆయన చెప్పారు. అమెరికాకు ఆ హత్య సమాచారాన్ని అందించినట్లు వెల్లడించారు. కెనడా జాతీయుడు నిజ్జార్ హత్య కేసులో భారతీయ దౌత్యవేత్తల పాత్ర ఉన్నట్లు ట్రూడో ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని ఫైవ్ ఐస్ దేశాలకు చేరవేసినట్లు ఆయన చెప్పారు. సోమవారం ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. ఇక కెనడాలో ఉన్న హై కమీషనర్లను కూడా వెనక్కి రప్పిస్తున్నట్లు భారత్ పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని ట్రూడో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది సమ్మర్ నుంచి నిజ్జార్ హత్య కేసులో ఫైవ్ ఐస్ దేశాలతో చర్చించామని, ముఖ్యంగా అమెరికాతో ఈ విషయాన్ని పంచుకున్నామని, భారత్ సాగిస్తున్న హత్యాకాండ గురించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్లు ట్రూడో వెల్లడించారు. కూటమి దేశాలతో ఈ అంశంపై పనిచేయనున్నట్లు ఆయన చెప్పారు. కెనడా, భారత్ మధ్య ఏర్పడిన దౌత్యపరమైన సంక్షోభం గురించి ఇప్పటి వరకు అమెరికా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
తీవ్రవాదం , హింస, వేర్పాటువాదానికి ట్రూడో ప్రభుత్వం మద్దతు ఇస్తున్నదని, ఈ అంశంలో భారత్ మరిన్ని చర్యలు తీసుకునే హక్కు ఉన్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.