Justin Trudeau | అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా చేయాలంటూ ట్రంప్ ఇటీవలే కీలక సూచన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరు దేశాధినేతల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ట్రంప్ సూచనను ట్రూడో ఘాటుగా తిరస్కరించారు. యూఎస్‌లో కెనడా విలీనమయ్యే అవకాశమే లేదని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోసారి అదే విషయంపై ట్రూడో స్పష్టతనిచ్చారు. సుంకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ట్రంప్ విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
ఈ మేరకు ట్రంప్‌పై ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చాలా నైపుణ్యం కలిగిన సంధానకర్త అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రజలు చమురు, సహజ వాయువు, విద్యుత్, స్టీల్, అల్యూమినియం, కలప, కాంక్రీట్ వంటివన్నీ కెనడా నుంచే కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. తమ దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తానని ఆయన అంటున్నారు. అలా చేసే ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకే విలీనం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అమెరికాలో కెనడా విలీనం ఎప్పటికీ జరగదని తేల్చి చెప్పారు. తమ ప్రజలు కెనడియన్లుగానే ఉండేందుకు ఇష్టపడతారని స్పస్టం చేశారు. టారిఫ్‌లు విధిస్తే వాటి ధరలు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉందని ట్రూడో పేర్కొన్నారు.
2018 వాణిజ్య వివాదం సమయంలో అమెరికా వస్తువులను లక్ష్యంగా చేసుకొని కెనడా కౌంటర్ టారిఫ్‌లను ఉపయోగించడాన్ని ఈ సందర్భంగా ట్రూడో ప్రస్తావించారు. అయితే, ఈ సారి తాము అలా చేయకూడదని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ అలా చేస్తే కెనడియన్లకు ధరలను పెంచినట్లైతుందని.. వాణిజ్య సంబంధాలను కూడా దెబ్బతీస్తుందని ట్రూడో వివరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలోకి అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నివారణకు ఇవి సహాయపడతాయని ఆయన చెప్పారు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే ప్రతి వస్తువుపై 25 శాతం సుంకం విధించే ఉత్తర్వులపై జనవరి 20 సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ఫెంటానిల్ స్మగ్లింగ్‌ను చైనా అరికట్టే వరకు ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం సుంకం విధించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటన తర్వాత ట్రంప్‌తో కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రూడోకు ట్రంప్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాలను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేదంటే సుంకాలు పెంచుతామని హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని సూచించారు. ఈ క్రమంలో ‘గవర్నర్ ఆఫ్ కెనడా’ అంటూ ట్రూడోపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ఇక ఇంతలో కెనడా పధాని ట్రూడో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటన తర్వాత ట్రంప్ మరోసారి కెనడాను 51వ రాష్ట్రంగా చేయాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం కెనడాలో చాలా మంది ప్రజలకు ఇష్టమేనని వ్యాఖ్యానించారు. కెనడాకు అధికంగా రాయితీలు ఇచ్చి తమ దేశం ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయం కెనడా ప్రధాని ట్రూడోకు తెలుసు కాబట్టే రాజీనామా చేశారని వ్యాఖ్యానించారు. అమెరికాలో విలీనమైతే దిగుమతి సుంకాలు ఉండవని, పన్నులు తగ్గుతాయన్నారు. అంతేకాకుండా రష్యా, చైనాలకు చెందిన నౌకల నుంచి ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ ప్రతిపాదనపై ట్రూడో ఘాటుగా స్పందించారు. అలా జరిగే సమస్యే లేదని తేల్చి చెప్పారు. ఇదే అంశంపై ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Also Read..
“Justin Trudeau | అమెరికాలో విలీనమవడం అసాధ్యం.. ట్రంప్ ప్రతిపాదనపై ఘాటుగా స్పందించిన ట్రూడో”
“Donald Trump | ట్రూడో రాజీనామా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు”
“Canada PM | ప్రధాని ట్రూడో స్థానంలో మార్చి 9న కొత్త నాయకుడి ఎన్నిక.. ప్రకటించిన లిబరల్ పార్టీ”
“Donald Trump | పక్క దేశాలపై ట్రంప్ కన్ను.. సైనిక చర్యకు దిగుతారా?”