తన సోషల్ మీడియా పోస్ట్‌లో ట్రంప్ ఇతర అంతర్జాతీయ వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావిస్తూ.. అందులో తాను జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతలు తగ్గాయన్నారు. సెర్బియా-కొసోవాలాలో దశాబ్దాలుగా ఉన్న ఈ ఉద్రిక్తతలు తగ్గించానని చెప్పుకొచ్చారు. గతంలో బైడెన్ నిర్ణయాలతో దీర్ఘకాలిక అవకాశాలు దెబ్బతిన్నాయని.. బైడెన్ నిర్ణయాలతో జరిగిన తప్పిదాలను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే నైలు నదిపై ఆనకట్ట విషయంలోనూ ఈజిప్ట్-ఇథియోపియా మధ్య పోరాటం జరిగిందని.. తన జోక్యం వల్లే ఇరుదేశాల మధ్య శాంతి నెలకొందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య త్వరలోనే శాంతి నెలకొంటుందని.. ఈ విషయంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
తాను ఏది చేసినా దేనికీ క్రెడిట్ పొందలేదని.. ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. అయితే, ఇజ్రాయెల్‌పై ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామని.. దేశం సైనిక చర్యలను నిలిపివేస్తే ప్రతిదాడులను నిలిపివేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేశారు. వాస్తవానికి అంతకు కొద్దిసేపటికి ముందే ఇరాన్‌ను సోషల్ మీడియా పోస్ట్‌లోనే హెచ్చరించడం గమనార్హం. ఇజ్రాయెల్ చేసిన దాడులతో యూఎస్‌కు సంబంధం లేదని.. తమపై దాడికి ప్రయత్నిస్తే కనీవినీ ఎరుగతి రీతిలో టెహ్రాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించడం ప్రస్తావనార్హం. గతంలోనూ భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ దాడులకు బెంబేలెత్తిన పాకిస్తాన్ దిగివచ్చింది. తన వల్లే ఉద్రిక్తతలు తగ్గాయని ట్రంప్ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారు. వాణిజ్యాన్ని ఉపయోగించి రెండుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించినట్టు చెప్పుకోగా.. భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించింది.