Joe Biden | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ (81) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది! తాజాగా గురువారం నాటో కూటమి సమావేశంలో ఆయన తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ‘ప్రెసిడెంట్ పుతిన్’గా సంబోధించారు. జెలెన్స్కీని మాట్లాడమని కోరుతూ.. ‘తన పట్టుదలతో ఎంతో ధైర్యం కలిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడికి మైక్ అందిస్తున్నాను.
దయచేసి ప్రెసిడెంట్ పుతిన్‌కు స్వాగతం పలకండి’ అని అన్నారు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి జెలెన్స్కీ ప్రెసిడెంట్ పుతిన్‌ను ఓడించబోతున్నారని తెలిపారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ మళ్లీ తడబడ్డారు. ‘చూడండి.. ఆమెకు అధ్యక్షురాలయ్యే అర్హత లేదని నేను అనుకొని ఉంటే ఉపాధ్యక్షుడు ట్రంప్‌ను ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసి ఉండను’ అని అన్నారు.
బైడెన్ మాటలతో అక్కడున్న డెమొక్రటిక్ పార్టీ అగ్రనేతలు ఆంటోనీ బ్లింకెన్, లాయిడ్ ఆస్టిన్ తెల్లబోయారు. ఎన్నికల వేళ బైడెన్ తడబడుతుండ టం డెమొక్రాట్లకు ఇబ్బందికరంగా మారింది.