Saba Haider | అమెరిరా రాజకీయాల్లో భారతీయులు ఇప్పటికే కీలకపాత్ర పోషిస్తున్నారు. చాలా మంది గవర్నర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, సెనెటర్లుగా, మేయర్లుగా సత్తా చాటుతున్నారు. భారత మూలాలున్న కమలా హారిస్ ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. కమలా హ్యారిస్ స్ఫూర్తితో ఎందరో భారతీయ యువతీయువకులు అమెరికా రాజకీయాల్లో వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
తాజాగా గజియాబాద్‌కు చెందిన సబా హైదర్.. కౌంటీ ఎన్నికల్లో ఆరంగేట్రం చేశారు. భారత సంతతికి చెందిన సబా హైదర్.. ఇల్లినాయిస్లోని డ్యూపేజ్ కౌంటీ నుంచి రాష్ట్ర బోర్డు ఎన్నికల బరిలో నిలిచింది. ఈమె అభ్యర్థిత్వాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా సబా హైదర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇవాళ జరుగనున్న ఎన్నికలో దాదాపు 10 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర స్థాయి బోర్డులో 19 మంది సభ్యులుండగా.. 11 మంది డెమోక్రాట్లే. ఈ ఎన్నికల్లో సబా విజయం సాధిస్తే డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్న అమీ షావేజ్ స్థానంలో నియమితులవుతారు.
సబా స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్. బీఎస్సీలో గోల్డ్ మెడల్ సాధించింది. అలీఘడ్ యూనివర్శిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేసిన తర్వాత 2007 లో ఉన్నత విద్య కోసం అమెరికాలోని చికాగో వచ్చారు. కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా డ్యూపేజ్ కౌంటీ ప్రజలకు తలలో నాలుకలా మారారు. కరోనా వ్యాప్తి సమయంలో సబా హైదర్ ఎంతో మందికి తన సామాజిక సేవతో ఆదుకుని దగ్గరయ్యారు. కమ్యూనిటీ ఆర్గనైజింగ్తోపాటు చిరు వ్యాపారవేత్తగా రాణిస్తున్న సబా హైదర్‌కు ఇద్దరు పిల్లలు. హెల్త్ అండ్ వెల్నెస్ రంగంలో గత దశాబ్దకాలంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎంప్లాయిమెంట్ కన్సల్టెంట్‌గా, యోగా టీచర్‌గా కూడా సేవలందించారు.