JD Vance | న్యూఢిల్లీ, వాషింగ్టన్, మార్చి 14: సంపన్న విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసాన్ని కల్పించేందుకు మార్గం చూపించే గోల్డ్ కార్డ్ పథకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గ్రీన్ కార్డుదారుల హక్కులపై చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. శాశ్వాత నివాస కార్డులుగా అధికారికంగా పిలుచుకునే గ్రీన్ కార్డులు విదేశీ జాతీయులు అమెరికాలో నివసించేందుకు, పని చేసేందుకు హక్కులు కల్పిస్తాయి. అయితే, శాశ్వత నివాసం అని పేరు పెట్టినప్పటికీ నిరవధికంగా ఉండిపోయే హక్కుగా మాత్రం పరిగణించరాదు. గ్రీన్ కార్డుదారునికి అమెరికాలో నిరవధికంగా నివసించే హక్కు ఉండబోదని వాన్స్ తాజాగా ప్రకటించారు.
ఇది వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం కాదని, ఇది తమ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని ఆయన చెప్పారు. గ్రీన్ కార్డుదారులను తమ సమాజంలో చేర్చుకోవాలా వద్దా అన్న విషయమై అమెరికా పౌరులుగా తామే నిర్ణయిస్తామని ఆయన అన్నారు. కొన్ని అత్యవసర పరిస్థితులలో గ్రీన్ కార్డును రద్దు చేయడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తాయి. కాగా, ప్రతిపాదిత గోల్డ్ కార్డ్ కార్యక్రమం ద్వారా 50 లక్షల డాలర్లు(దాదాపు రూ.43 కోట్లు) ఫీజు చెల్లించి అమెరికాలో నివసించి, పని చేసే హక్కును విదేశీ పౌరులు పొందవచ్చు. ప్రస్తు తం అమల్లో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా స్థానంలో ఈ పథకం రానున్నది.
జన్మతః పౌరసత్వంపై సుప్రీంకోర్టుకు ట్రంప్
జన్మతః పౌరసత్వ హక్కును కట్టడి చేయడం కోసం అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును గురువారం ఆశ్రయించింది. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాలపై వాషింగ్టన్, మసాచుసెట్స్, మేరీల్యాండ్ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఇంజక్షన్ ఉత్తర్వుల పరిధిని ప్రభుత్వం ప్రశ్నించింది. దేశ వ్యాప్తంగా అమలయ్యేలా ఇచ్చిన ఆదేశాలను జస్టిస్(న్యాయ) డిపార్ట్మెంట్ సవాల్ చేసింది. ట్రంప్ ఆదేశాలను డెమొక్రటిక్ స్టేట్ అటార్నీస్ జనరల్, ఇమిగ్రేషన్ హక్కుల మద్దతుదారులు, కాబోయే తల్లులు కోర్టుల్లో సవాల్ చేశారు. అమెరికా రాజ్యాంగానికి జరిగిన 14వ సవరణను ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తున్నాయని వాదించారు. అయితే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ 14వ సవరణను ప్రశ్నిస్తున్నది. చట్టవిరుద్ధంగా ఉంటున్నవారికి లేదా చట్టబద్ధంగా, తాత్కాలికంగా దేశంలో ఉంటున్నవారికి జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వడం ఈ సవరణ ఉద్దేశం కాదని వాదిస్తున్నది. ఈ సవరణను పరిమిత దృక్పథంతో చూడాలని, విశాల దృక్పథంతో చూడరాదని చెప్తున్నది.
అమెరికాతో చర్చల్లో ‘భారత్‌కే ప్రాధాన్యం’: గోయల్
వాణిజ్య ఒప్పందం కోసం అమెరికాతో జరిపిన చర్చల్లో భారత దేశానికే ప్రాధాన్యం అనే వైఖరిని ప్రదర్శించానని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తెలిపారు. ఆయన గత వారం అమెరికాలో ఆ దేశ వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్‌తో జరిపిన చర్చల గురించి ఎక్స్‌లో వివరించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా ముందు చూపుతో కూడిన ముందడుగుగా ఈ చర్చలను అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య గొప్ప ఆర్థిక పరివర్తనకు వేదిక ఏర్పాటైందన్నారు. ‘భారత దేశానికే పెద్ద పీట’, ‘అభివృద్ధి చెందిన భారత్’, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అనేవి ఈ చర్చల్లో భారత దేశ వైఖరికి మార్గదర్శకంగా నిలిచాయని వివరించారు.