టోక్యో, జనవరి 4: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్ మహిళ టోమికో ఇతోకా మృతి చెందినట్టు శనివారం అధికారులు ప్రకటించారు. ఆషియాలో నివసించే టోమికోకు నలుగురు పిల్లలు, ఐదుగురు మనవలు ఉన్నారు. డిసెంబర్ 29న ఆమె ఒక నర్సింగ్‌హోమ్‌లో చికిత్స పొందుతూ మరణించారని ఆ నగర మేయర్ తెలిపారు.
స్పెయిన్‌కు చెందిన 117 ఏండ్ల బ్రన్యాస్ మోరియా గత ఏడాది ఆగస్టులో మరణించిన తర్వాత ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా టోమికో నిలిచింది. కాగా, 12.4 కోట్ల జనాభా ఉన్న జపాన్‌లో మూడో వంతు 65 అంత కన్నా ఎక్కువ వయసున్న వృద్ధులు. సెప్టెంబర్‌లో వెల్లడైన గణాంకాల ప్రకారం ఆ దేశంలో 95 వేల మంది 100 లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారుండగా, వారిలో 88 శాతం మహిళలు.