టోక్యో: జపాన్‌లో 9 మందిని చంపిన 34 ఏళ్ల వ్యక్తికి ఇవాళ మరణశిక్ష అమలు చేశారు. 2017లో ఆ నిందితుడు 8 మంది అమ్మాయిలను హత్య చేశాడు. అతనికి 2022లో మరణశిక్షను ఖరారు చేశారు. నిందితుడు టకాహిరో షిరాయిసి.. ట్విట్టర్(Twitter killer) అకౌంట్ ద్వారా వ్యక్తులను పరిచయం చేసుకుని, వాళ్లను మర్డర్ చేశాడు. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనల్లో ఉన్న యువతను టార్గెట్ చేసి.. వాళ్లను తన ఇంటికి రప్పించి హతమార్చినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. 15 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసున్న మహిళలనే అతను టార్గెట్ చేశాడు. 2017 అక్టోబర్‌లో అతని ఆగడాలు బయటపడ్డాయి. ఓ అదృశ్య వ్యక్తి కేసులో విచారణ చేపడుతున్న సమయంలో జమా సిటీలో గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలు దొరికాయి. దాని ఆధారంగా నిందితుడు టకాహిరోను పట్టుకున్నారు.
ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉన్న వ్యక్తులను మర్డర్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఎక్స్‌గా పేరుమార్చుకున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ద్వారా అతను బాధితులకు దగ్గరయ్యాడు. ఆన్లైన్లో సూసైడ్ గురించి డిస్కస్ చేశాడు. చనిపోవాలనుకుంటున్న వారికి సహకరిస్తానని చెప్పి ఆ తర్వాత వాళ్లకు ఇంటికి రప్పించి మర్డర్ చేసినట్లు తేలింది. బాధలో ఉన్న వారిని ఆదుకోవాలనుకుంటున్నానని, నేరుగా మీరు నాకు మెసేజ్ చేయండి అని అతను ట్విట్టర్ ప్రొఫైల్‌లో రాసుకున్నాడు.
పోలీసులు నిందితుడి ఫ్లాట్‌కు వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఇంట్లో ఉన్న కూలర్లు, టూల్ బాక్సుల్లో ముక్కలైన శరీర భాగాలను గుర్తించారు. ప్రాసిక్యూటర్లు అతనికి డెత్ పెనాల్టీ ఇవ్వాలని వాదించారు. అయితే బలవన్మరణానికి బాధితులు ఇష్టపడ్డారని, అందుకే నిందితుడికి తక్కువ శిక్ష వేయాలని కోర్టులో అతని తరపున లాయర్లు వాదించారు. అతని మానసిక స్థితిని అంచనా వేయాలని భావించారు. బాధితుల్ని తానే చంపినట్లు చివరకు అతను అంగీకరించాడు.