టోక్యో: ప్రధాని మోదీ (PM Modi) పర్యటన వేళ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాకు (America) జపాన్ (Japan) షాకిచ్చింది. పెట్టుబడులపై చర్చించేందుకు అగ్రరాజ్యంలో పర్యటించాల్సిన జపాన్ వాణిజ్య మంత్రి చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump Tariffs) జపాన్‌పై 25 శాతం సుంకాలు విధించారు. దీంతో ఆ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు టోక్యో నిర్ణయించింది. ఇందులో భాగంగా 550 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు (Trade Deal) పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇరు దేశాలు ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. దీంతో సుంకాలను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.
వాణిజ్య చర్చల్లో భాగంగా జపాన్ మంత్రి ర్యోసీ అకజవా గురువారం అమెరికాకు బయల్దేరాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఆయన తన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి యోషిమసా హయాషి ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో పెట్టుబడులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఇంకా కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉండటంతో ర్యోసీ తన పర్యటనను రద్దు చేసుకున్నారని అందులో వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉండగా, మంత్రి పర్యటన రద్దవడంతో అది మరింత ఆలస్యం కానుంది. ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటిస్తున్న సమయంలోనే ఇది చోటుచేసుకోవడం గమనార్హం.
కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ టోక్యో చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన టోక్యో విమానాశ్రయంలో దిగారు. ఇరుదేశాల 15వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అనంతరం జపాన్ ప్రధాని ఇషిబాతో భేటీ కానున్నారు. ఏఐ, సెమీకండక్టర్లు, బుల్లెట్ రైలు, పెట్టుబడులే అజెండాగా వీరి మధ్య ద్వైపాక్షిక చర్చ జరగనుంది. అక్కడి నుంచి ప్రధాని మోదీ చైనా వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాంజిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.