Solar Power | టోక్యో, ఏప్రిల్ 27 : అంతరిక్షంలో సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు జపాన్ సన్నాహాలు చేస్తున్నది. స్పేస్‌లో సూర్యరశ్మి సాయంతో కరెంటును తయారు చేసి, అక్కడి నుంచి నేరుగా భూమిపైకి పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. స్పేస్ నుంచి భూమిపైకి వైర్ల అవసరం లేకుండానే, మైక్రోవేవ్ రూపంలో ఆ విద్యుత్తును పంపించేలా ప్రయోగాలు చేస్తున్నది. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని జపాన్ స్పేస్ సిస్టమ్స్ (జేఎస్ఎస్) శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒహిసామా (జపనీస్‌లో సూర్యుడు) పేరిట చేపడుతున్న ఈ ప్రయోగం కోసం ఇప్పటికే జపాన్ శాస్త్రవేత్తలు అన్నీ సంసిద్ధం చేశారు. కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, ఏప్రిల్ తర్వాత ఏ క్షణంలోనైనా ఈ ప్రయోగం నిర్వహించే ఆస్కారం ఉంది.
ప్రయోగంలో భాగంగా 400 పౌండ్స్ (180 గ్రాములు) మాత్రమే బరువుండే ఓ శాటిలైట్‌ను శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపించనున్నారు. ఈ శాటిలైట్‌లో 2 స్కేర్ మీటర్ల సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. ఈ సోలార్ ప్యానెల్ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్తును బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. సాధారణంగా భూమిపై సోలార్ ప్యానెళ్లు ఉత్పత్తి చేసే కరెంట్‌ను వైర్ల సాయంతో సరఫరా చేస్తారు. అయితే, స్పేస్‌లో వైర్ల సదుపాయం లేకపోవడంంతో స్పేస్ నుంచి భూమికి ఈ విధంగా విద్యుత్తును పంపించడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో జపాన్ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిపై దృష్టి సారించారు. స్పేస్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్తును తొలుత మైక్రోవేవ్ రూపంలోకి మారుస్తారు. ఆ తర్వాత ఎనర్జీ బీమ్ రూపంలో ఆ విద్యుత్తును భూమికి పంపిస్తారు. భూమిపై ఉండే యాంటెన్నాలు దాన్ని రిసీవ్ చేసుకుంటాయి. ప్రస్తుతానికి చాలా తక్కువ మొత్తంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ప్రయోగం చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయాలని జపాన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
స్పేస్‌లో సౌర విద్యుత్తు ఉత్పత్తిపై ప్రయోగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2020లో ఎక్స్-37బీ ఆర్బిటల్ టెస్ట్ వెహికిల్ ద్వారా యూఎస్ నావల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్ఆర్ఎల్) పరిశోధకులు స్పేస్‌లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేశారు. వైర్ల అవసరం లేకుండానే మైక్రోవేవ్ ఎనర్జీ రూపంలో దాన్ని భూమిపైకి పంపించారు. అయితే, కిలోవాట్-అవర్ సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఎక్కువ వ్యయం అవడంతో ఆ పరిశోధనలకు స్వస్తి పలికారు. ఇప్పుడు భూమిపై కిలోవాట్-అవర్ సౌర విద్యుత్తు ఉత్పత్తికి 5 సెంట్స్ (100 అంటే ఒక డాలర్) మాత్రమే వ్యయం అవుతుండటంతో జపాన్ పరిశోధకులు ప్రయోగం చేస్తున్నారు.