సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 21:43:29

క్యాన్సర్ వచ్చింది.. మేం పోరాడాం.. నేను గెలిచాను

క్యాన్సర్ వచ్చింది.. మేం పోరాడాం.. నేను గెలిచాను

ప్రపంచానికి సంతోషకరమైన వార్తను తెలియజేయడానికి నాలుగేండ్ల చిన్నారి లూలా బెత్ బౌడెన్ కేవలం ఆరు సాధారణ పదాలు తీసుకుంది. తన కుమార్తె క్యాన్సర్‌ను ఓడించిందని ప్రకటించడానికి ఫొటోగ్రాఫర్ కూడా అయిన తల్లి క్రిస్టిన్ బౌడెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాప ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ సంతోషకరమైన క్షణాలను ఉత్సాహంగా జరుపుకోవడానికి ఆమె ఫొటోషూట్ నిర్వహించింది. తలను బ్యాండ్‌తో అలంకరించి అందమైన నారింజ రంగు దుస్తులు ధరించి చూడ చక్కగా ముస్తాబు చేసింది. "అది వచ్చింది.. మేము పోరాడాం.. నేను గెలిచాను.. అధికారికంగా క్యాన్సర్ లేని 08.28.2020" అని ఒక బోర్డుతో నవ్వులొలకబోస్తూ ఫొటోకు పోజులిచ్చింది.

లూలా బెత్ కు 'విల్మ్స్ ట్యూమర్' తో బాధపడుతోంది. మూత్రపిండంలో వచ్చే ఒక రకమైన పీడియాట్రిక్ క్యాన్సర్. చిన్నారి శరీరం లోపల కణితి దాదాపు ఫుట్‌బాల్ పరిమాణంలో ఉంది. శస్త్రచికిత్స సహాయంతో మూత్రపిండంతో పాటు దాన్ని తొలగించాల్సి వచ్చింది. 22 వారాల వ్యవధిలో 13 రౌండ్ల కీమోథెరపీ శస్త్రచికిత్స తర్వాత పాప ఆరోగ్యం కుదుటపడింది. ఈ భయంకరమైన వ్యాధితో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వారిలో కొందరు సజీవంగా బయటకు వచ్చినప్పుడు అరుదుగా ఒక అద్భుతం జరుగుతుంది. బౌడెన్ కుటుంబానికి లూలా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో గెలిచిన దానికంటే ఎక్కువ ఆనందం కలిగింది.

"ఈ సంతోషకర వార్త మా ఇంట్లో జరుగుతుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. ఏదో అద్భుతం జరిగి మా చిన్నారి ప్రాణాలతో నిలిచింది" అని పాప తల్లి క్రిస్టిన్ బౌడెన్ చెప్పారు. చిన్నారి లూలా ఫొటోలను ఇన్ స్టాగ్రాంలో చూసిన వారంతా క్యాన్సర్ పై గెలువడం చాలా సంతోషం అంటూ కామెంట్లు జతచేశారు.


logo