టెహ్రాన్: ఇజ్రాయెల్ వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. (Israel’s attack on Iran) ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల గురించి అయతుల్లా అలీ ఖమేనీ ఆదివారం స్పందించారు. ‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు.
కాగా, ఇజ్రాయెల్ దురాక్రమణపై ప్రతిస్పందించే హక్కు ఇరాన్‌కు ఉందని ఖమేనీ తెలిపారు. ‘ఇరాన్ ప్రజల శక్తి, సంకల్పాన్ని ఇజ్రాయెల్ పాలకులకు ఎలా తెలియజేయాలో, దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే చర్యలను ఎలా తీసుకోవాలో అధికారులు నిర్ణయించాలి’ అని అన్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సైనికులు మరణించినట్లు ఇరాన్ తెలిపింది. అలాగే నష్టం చాలా తక్కువేనని పేర్కొంది. తమను తాము రక్షించుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.