లండన్, డెయిర్ అల్-బలాహ్: మరింత మానవతా సాయాన్ని అనుమతించకపోతే గాజాలో రానున్న 48 గంటల్లో 14 వేల మంది దాకా చిన్నారులు చనిపోవచ్చని ఐక్యరాజ్యసమితి మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. మిత్ర దేశాల ఒత్తిడితో ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిమితంగా మాత్రమే మానవతా సాయం కింద ఆహారం తదితరాలను గాజా స్ట్రిప్‌లోకి అనుమతిస్తున్నది. అయితే ఆ పరిమిత సాయం ‘సముద్రంలో నీటి బొట్టంత’ అని యూఎన్ మానవతా సాయం విభాగం అధ్యక్షుడు టామ్ ఫ్లెచర్ అన్నారు. ‘పోషకాహార లేమి వల్ల తమ పిల్లలకు పాలు కూడా ఇవ్వలేని స్థితిలో అక్కడి తల్లులు ఉన్నారు. అలాంటి అమ్మలకు తగిన ఆహారం అందివ్వడానికి మేం అన్ని రకాల ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం’ అని ఫ్లెచర్ బీబీసీ రేడియో 4తో మాట్లాడుతూ అన్నారు.
మంగళవారం గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్, గాజా సిటీ, డెయిర్ అల్-బలాహ్ తదితర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 60 మంది మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. పునరావాస కేంద్రంగా మారిన ఇండ్లు, బడిపై జరిగిన దాడిలో 18 మంది మృతి చెందారు.