టెల్ అవివ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ(PM Netanyahu) కుమారుడు అవ్నర్ నెతన్యహూ వివాహం రెండో సారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బెంజిమన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇజ్రాయిలీ ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. గురువారం ఇరాన్ చేసిన దాడిలో బీర్షెబాలో ఉన్న సొరోకా ఆస్పత్రి ధ్వంసమైన విషయం తెలిసిందే. అక్కడకు సందర్శనకు వచ్చిన నెతన్యహూ తన కుమారుడి వివాహం గురించి మాట్లాడారు. భావోద్వేగంగా మాట్లాడుతూ.. ఎన్నో కుటుంబాల తరహాలో తన కుటుంబం కూడా త్యాగాలు చేసినట్లు ఆయన చెప్పారు. అవ్నర్ గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు భార్య సారా కూడా వివాహం వాయిదా పడడం పట్ల మనోవేదనకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు.
వాస్తవానికి గత నవంబర్‌లో అవ్నర్ పెళ్లి జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల వల్ల వాయిదా వేశారు. మళ్లీ ఈ వారం జరగాల్సిన పెళ్లిని ఇరాన్ దాడుల వల్ల వాయిదా వేశారు. అయితే తమ కుటుంబ పరిస్థితిని వివరిస్తూ.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీషర్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇబ్బందిపడుతున్నారని, తమ కుటుంబం కూడా ఇబ్బందిపడుతోందని ప్రధాని నెతన్యహూ తెలిపారు. పర్సనల్‌గా నష్టం జరిగినా తన భార్య సారా ఓ హీరోలా మారినట్లు మెచ్చుకున్నారు. కుటుంబానికి నష్టం జరిగినట్లు నెతన్యహూ చెప్పడం పట్ల ప్రజల్లో విమర్శలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో స్పందిస్తూ.. దేశ ప్రజల బాధను విస్మరిస్తూ నెతన్యహూ వ్యవహరిస్తున్నట్లు కొందరు విమర్శించారు.
భార్యను హీరోగా పోల్చిన నెతన్యహూను కొందరు తప్పుపట్టారు. ఖరీదైన వస్తువులు కొనే ఆమెను హీరో అని ఎలా పిలుస్తారని కొందరన్నారు. నైట్ షిఫ్ట్‌లకు వెళ్లే డాక్టర్లు హీరోలు అని, విద్యార్థులను జూమ్ మీట్లో కలుపుతున్న టీచర్లు హీరోలని ఆన్లైన్లో కామెంట్స్ వస్తున్నాయి.