Israel | టెల్ అవీవ్, మే 24: యుద్ధం పేరిట గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండపై సాక్షాత్తూ ఆ దేశానికి చెందిన ఎంపీ ఆ దేశ పార్లమెంట్ క్నెసెట్ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడాదిన్నరగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 19 వేల మంది పిల్లలు, 53 వేల మంది పౌరులు మరణించారని, అక్కడ ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, దవాఖానలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ‘ఇంత చేసినా రాజకీయంగా విజయం సాధించలేదని భావిస్తున్న పిచ్చివాళ్లు మీరు’ అని విపక్ష ఎంపీ ఐమన్ ఒడె ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన మాట్లాడుతుండగా అధికార ఎంపీలు అభ్యంతరం చెప్పారు. అదే సమయంలో మార్షల్స్ ఆయనను బలవంతంగా పోడియం నుంచి తీసుకుపోయారు. కాగా, గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ వైమానిక దళాలు జరిపిన దాడిలో 60 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
గాజాలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వారికి కనీస సదుపాయాలు కూడా అందడం లేదని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న యుద్ధం ప్రస్తుతం అత్యంత క్రూర దశలో ఉందని అన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సుమారు 400 ట్రక్కుల్లో గాజాలోకి సాయం ప్రవేశిస్తే 115 ట్రక్కు ల సాయం మాత్రమే అందిందన్నారు. గాజాలోని పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనమ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలోని ప్రజలపై దయ చూపాలని టెల్ అవీవ్‌ను కోరుతున్నట్టు ఆయన విజ్ఞప్తి చేశారు.