వాషింగ్టన్, జెరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలలో జోక్యం చేసుకుని ఇరాన్‌పై దాడి చేసే విషయమై రెండు వారాలలో నిర్ణయం తీసుకోవాలని అమెరికా తనకు తానుగా విధించుకున్న గడువు ఇజ్రాయెల్‌ను గందరగోళంలోకి నెట్టివేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత సీనియర్ అధికారులు అమెరికా జోక్యాన్ని బహిరంగంగా కోరుకుంటున్నారు. పశ్చిమాసియాను ప్రశాంతంగా శాంతియుత ప్రాంతంగా మార్చి, అణ్వస్ర్తాలను సంపాదించుకున్న ఇరాన్ నుంచి ప్రపంచాన్ని విముక్తి చేయాల్సిన బాధ్యత అమెరికాకు, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉందని ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గ్యాలంట్ సీఎన్ఎన్కి తెలిపారు. ఇరాన్‌పై సాగుతున్న పోరులో తమతో అమెరికా చేతులు కలిపితే పోరాట స్వరూపమే మారిపోతుందని, ఇరాన్‌కు చెందిన ఫోర్దో అణు కేంద్రాన్ని విజయవంతంగా ధ్వంసం చేసే అవకాశం ఉంటుందని ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు పలువురు సీఎన్ఎన్కి తెలిపారు. టెహ్రాన్‌కు దక్షిణాన ఓ పర్వతం కింద భూగర్భంలో ఫోర్దో అణు పరిశోధనా కేంద్రాన్ని ఇరాన్ నిర్మించింది. చాలా లోతున ఉన్న ఆ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే 30,000 పౌండ్ల(13,600 కిలోల) బంకర్ బస్టర్ బాంబులు అవసరమవుతాయని, వీటిని అమెరికన్ బాంబర్లు మాత్రమే మోసుకువెళ్లగలవని వారు తెలిపారు.
ఇరాన్ అణ్వస్ర్తాన్ని తయారు చేస్తోందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసీ గిబ్బర్డ్ చేసిన వ్యాఖ్యలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ఆమె అభిప్రాయం తప్పని ట్రంప్ శుక్రవారం చెప్పారు. అణ్వస్ర్తాల తయారీపై ఇరాన్ నిర్ణయం తీసుకుంటే కొన్ని వారాలు లేదా కొన్ని నెలలలో వాటిని తయారు చేయగల సామర్థ్యం ఆ దేశానికి ఉందని అమెరికా నిఘా సంస్థ వద్ద సమాచారం ఉందని శుక్రవారం ఎక్స్‌లో గిబ్బర్డ్ తెలిపారు. దీనిపై విలేకరుల వద్ద ట్రంప్ స్పందిస్తూ మార్చిలో ఆమె చెప్పిన విషయాన్ని మీడియా ఇప్పుడు అసందర్భంగా ప్రస్తావించిందని, తమ మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే అణ్వస్ర్తాలను తాము తయారు చేస్తున్నామన్న ఆరోపణలను ఇరాన్ ఖండించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగా ఇరాన్ భారీ క్షిపణులతో చేస్తున్న దాడులను తిప్పి కొట్టేందుకు బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇజ్రాయెల్ వినియోగిస్తున్నది. మానవ రహిత ఏరియల్ వాహనాలతో పాటు క్షిపణులను కూడా ్థ సమర్థంగా అడ్డుకుంటున్నది. బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అభివృద్ధిలో ఇజ్రాయెల్ ఏరోస్పేస్తో పాటు భారత్‌కు చెందిన డీఆర్డీవో కూడా పాలు పంచుకుంది. ఈ వ్యవస్థ యూఏవీలు, క్రూయిజ్ క్షిపణులతో పాటు ఎయిర్ బోర్న్ టార్గెట్లను ఎదుర్కోగలదు.