టెల్ అవివ్: ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా మరో విమర్శ ఎదుర్కొంది. గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై (aid convoy) ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారు. ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబు దాడుల్లో ఇప్పటికే 20,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు.
కాగా, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ద్వారా గాజాలోని పాలస్తీనా శరణార్థులకు సహాయ సామాగ్రిని అందజేస్తున్నారు. అయితే ఉత్తర గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపినట్లు గాజాలోని యూఎన్ఆర్డబ్ల్యూఏ డైరెక్టర్ టామ్ వైట్ తెలిపారు. అంతర్జాతీయ కాన్వాయ్ నాయకుడు, ఆయన బృందం సురక్షితంగా ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పుల్లో ఒక వాహనానికి నష్టం జరిగినట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినట్లు వివరించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు గాజాలో బందీగా ఉన్న ముగ్గురు సొంత పౌరులపై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపి చంపారు. ఇటీవల జరిగిన ఈ సంఘటనపై ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తమ వారిని విడిపించేందుకు హమాస్‌తో చర్చలు జరుపాలని డిమాండ్ చేస్తున్నారు.