Israel | గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం వార్‌జోన్‌గా ప్రకటించింది. నగరంలో మానవతా సహాయం పంపిణీని సైతం నిషేధించింది. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న నగరంలోని వేలాది మంది ప్రజల ఇబ్బందులను మరింత పెంచనున్నది. గాజా నగరంలో సైనిక కార్యకలాపాలపై వ్యూహాత్మక నిషేధం ఇకపై వర్తించదని సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొంది. ఈ ప్రాంతాన్ని ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంగా ప్రకటించింది. గాజా నగరం మినహా మిగిలిన ప్రాంతంలో స్థానిక వ్యూహాత్మక బ్లాక్‌లు అమలులో ఉంటాయని ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ పౌరులను రక్షించడానికి గాజాలోని ఉగ్రవాద గ్రూపులపై వారు దాడి కార్యకలాపాలను నిర్వహిస్తారని ఐడీఎఫ్ చెప్పింది.
ఈ క్రమంలో గాజా నగరాన్ని ఆక్రమించడానికి ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతోందని భావిస్తున్నారు. గాజాలో మిలియన్ జనాభాలో సగం మంది ఆశ్రయం పొందారు. గ్లోబల్ హంగర్ మానిటర్.. గాజా నగరంతో పాటు పరిసర ప్రాంతాలు ఇప్పుడు అధికారికంగా కరువును ఎదుర్కొంటున్నాయని తెలిపింది. మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ప్రకారం.. 5,14,000 మంది ప్రజలు కరువుకు ప్రభావితమవుతున్నారు. ఈ సంఖ్య సెప్టెంబర్ చివరి నాటికి 6,41,000 మందికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే, ఇజ్రాయెల్ ఈ నివేదికను తిరస్కరించింది. అంచనాలు తప్పని.. నివేదిక అంతా పక్షపాతంతో కూడుకున్నదని పేర్కొంది. సర్వే అసంపూర్ణ సమాచారాన్ని మాత్రమే తీసుకుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇది ఎక్కువగా హమాస్ నుంచి వచ్చిందని.. ఇటీవల ఆహార ధాన్యాలు గాజాకు చేరుకున్నాయని అందులో ప్రస్తావించలేదని ఆరోపించింది.