టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సయోధ్య కుదరడంతో బందీల విడుదలకు మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడుతలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 737 మంది పాలస్తీనియా పౌరులను విడిచిపెట్టనున్నట్లు ఇజ్రాయెల్ (Israel) ప్రకటించింది. వారంతా దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న బందీలు, ఖైదీలను విడుదల చేయనున్నట్లు ఆ దేశ న్యాయ శాఖ ప్రకటించింది. వారిని ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని, అందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. కాగా, గతంలో 95 మందిని విడుదల చేస్తున్నట్లు ఓ జాబితాను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు.
అయితే హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ శనివారం ఉదయం ఆమోదం తెలిపింది. దీంతో 737 మంది బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను హమాస్ ఇజ్రాయెల్‌కు అప్పగిస్తుంది. అదేవిధంగా, తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. బందీల్లో తొలి బృందాన్ని ఆదివారం విడుదల చేయడంతో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.