Israel | జెరూసలేం, అక్టోబర్ 26: ప్రతీకార దాడులు చేస్తాం.. ఇంతకు ఇంతా బదులు చెప్తాం.. అంటూ గత కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. తమపై ఈ నెలలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో బదులు తీర్చుకుంది. శనివారం తెల్లవారుజామున ఆ దేశ స్థానిక స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ వాయుసేన దాడికి దిగింది. ఈ దాడులతో ఇద్దరు సైనికులు సహా నలుగురు మృతి చెందినట్టు ఇరాన్ తెలిపింది.
తమ క్షిపణి, డ్రోన్ల తయారీ కేంద్రాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఇతర సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడి జరిపిందని, దీనికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇలాం, ఖుజెస్థాన్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు ఇతర ప్రాంతాలు లక్ష్యంగా దాడులు జరిగాయని, నష్టం పరిమితంగానే ఉందని తెలిపింది.
తమ విమాన సైనిక వ్యవస్థను యాక్టివేట్ చేశామని, పలు ఇజ్రాయెల్ రాకెట్లను కూల్చి వేశామని ఇరాన్ సైన్యం తెలిపింది. కాగా, ముందు జాగ్రత్త చర్యగా తమ దేశ గగనతలాలను మూసివేస్తున్నట్టు ఇరాన్, ఇరాక్, సిరియాలు ప్రకటించాయి. టెహ్రాన్‌లో శనివారం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టు ఇరాన్‌కు చెందిన టీవీ నిర్ధారించింది. ఇరాన్‌పై దాడి జరగడానికి కొద్ది సేపు ముందే దాడి గురించి వైట్ హౌస్ వర్గాలు గుర్తించినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది.
అక్టోబర్ 1న ఇరాన్ 100కు పైగా క్షిపణులతో తమ దేశంపై జరిపిన దాడికి ప్రతీకారంగానే ప్రతి దాడి చేసినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ(ఐడీఎఫ్) తెలిపింది. తమపై భూతలం నుంచి వాయు మార్గంలో వెళ్లే క్షిపణుల ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశామని తెలిపింది. 100 విమానాలతో 20 టార్గెట్లపై తాము జరిపిన దాడి ముగిసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే చమురు కేంద్రాలపై దాడి గురించి ఐడీఎఫ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ‘ఇప్పటివరకు ఇరాన్ మా దేశంపై ప్రత్యక్షంగా దాడి చేసింది.
ఆ దాడిలో పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుంది. దానికి ఇప్పుడు ఆ దేశం మూల్యం చెల్లించుకుంది’ అని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. తమ పని తాము పూర్తి చేశామని.. ఇక దీనిపై ఇరానే స్పందించాలని ఆయన అన్నారు. 1980 నుంచి నిరంతరం ఇరు దేశాల మధ్య ఘర్షణ కొనసాగుతున్నది. అయితే అప్పటి నుంచి నిత్యం కాల్పులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఇలా బహిరంగంగా దాడి చేయడం ఇదే తొలిసారి.
కాగా, ఇరాన్‌పై చేసిన తాజా దాడి 1981లో ఇరాక్‌పై ఇజ్రాయెల్ చేసిన ‘ఆపరేషన్ ఒపేరా’ను గుర్తుకు తెచ్చింది. ఇజ్రాయెల్ అప్పుడు కూడా వైమానిక దాడిలో ఇరాక్‌లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్‌ను ధ్వంసం చేసింది. శత్రు దేశం రాడార్లకు దొరక్కుండా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఆ దేశంలోకి చొరబడి విజయవంతంగా దాడి చేసి సురక్షితంగా వెనక్కి వచ్చాయి.
ఇజ్రాయెల్‌పై దాడులను సౌదీ అరేబియా ఖండించింది. ప్రజల భద్రతకు భంగం కలిగించే, స్థిరత్వాన్ని బెదిరించే ఇజ్రాయెల్ చర్యను తప్పు బట్టింది. ఈ ప్రాంతంలోని సంఘర్షణ తీవ్రతను తిరస్కరించేందుకు తాము దృఢమైన వైఖరితో ఉన్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్‌లో పేర్కొంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు, అస్థిరతను తగ్గించేందుకు అంతర్జాతీయ వర్గాలు, పలుకుబడి ఉన్న పార్టీలు తగిన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, గాజా పోరుకు అంతం పలకడానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ఈ తీవ్ర చర్యల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్ చర్య ప్రాంతీయ భద్రత, సుస్థిరతపై ప్రభావం చూపుతుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడి హింసకు మరింత ఆజ్యం పోయడమే కాక, శాంతి చర్చల ప్రయత్నాలను దిగజారుస్తుందని ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్న ఒమన్ పేర్కొంది. ఈ ప్రాంత భద్రతను ఇజ్రాయెల్ ప్రమాదంలోకి నెట్టిందని కువైట్ విదేశాంగ శాఖ తెలిపింది.
కాగా, ఈ పరిణామాలతో ఇరాన్, సిరియా, ఇరాక్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించాయి. ఫ్లైట్ రాడర్ 24 వెబ్సైట్ కథనం ప్రకారం ఈ మూడు దేశాల ఆకాశ మార్గాల మీదుగా ఎలాంటి వైమానిక రాకపోకలను జరపనివ్వరు. కాగా, తమపై దాడుల అనంతరం దేశంలో విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని త్వరలో పునరుద్ధరిస్తున్నట్టు ఇరాన్ తెలిపింది.
ఇరాన్ పోలీస్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం జరిపిన దాడిలో 10 మంది అధికారులు హతమయ్యారు. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 1200 కి.మీ దూరంలోని దక్షిణ ప్రావిన్స్‌లోని సిస్తాన్, బెలూచెస్తాన్లో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది ఎవరో ఇంతవరకు వెల్లడించపోయినప్పటికీ ఇరాన్, అఫ్గాన్, పాక్‌లను వ్యతిరేకించే హల్వాష్ అనే గ్రూప్ దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
పశ్చిమాసియాలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తత, అశాంతిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో అన్ని వర్గాలు సంయమనం పాటించాలని, దౌత్య, చర్చల మార్గం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో కోరింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏ ఒక్కరికీ ప్రయోజనాన్ని చేకూర్చవని, పశ్చిమాసియా, దానికి సంబంధించిన దేశాల్లో శాంతి, సుస్థిరతలపై తీవ్ర ప్రభావం పడుతుందని, పైగా అమాయక పౌరులు, బందీలు దీని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ఎంతమాత్రం స్పందించరాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. కామన్వెల్త్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘ఇరాన్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కానీ, సంయమనం చూపాలని గట్టిగా చెబుతూ అన్ని వైపులా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఇజ్రాయెల్ దాడిపై ఇరాన్ స్పందించకూడదని నేను స్పష్టంగా చెబుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడిని హమాస్ ఖండించింది. ‘ఇది సార్వభౌమాధికార కఠిన ఉల్లంఘన’ అని వ్యాఖ్యానించింది.