Nethanyahu : ఇరాన్ (Iran) అణు కార్యక్రమం (Nuclear program) లో భాగంగా కీలక పరికరాలు తయారుచేసే స్థావరాలపై తాము అక్టోబర్‌లోనే దాడి చేశామని ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. ఈ విషయాన్ని ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్‌లో అణు కార్యక్రమం ఆగలేదని ఆయన వెల్లడించారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టూ మోహరించిన మూడు ఎస్-300 బ్యాటరీలను తాము ఏప్రిల్‌లో ధ్వంసం చేశామని నెతన్యాహు తెలిపారు. మరో మూడు బ్యాటరీలు ఆ దేశం వద్ద మిగిలిఉండగా.. అక్టోబర్‌లో చేసిన దాడిలో వాటిని కూడా ధ్వంసం చేశామని చెప్పారు. అదే సమయంలో క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేశామన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని పట్టించుకోకపోతే మిగిలిన సమస్యలు పునరావృతం అవుతాయని, ఇరాన్ ముసుగు సంస్థలు మరోసారి బలోపేతమై ఇజ్రాయెల్‌పై దాడులకు దిగుతాయని నెతన్యాహు పేర్కొన్నారు. అందుకే ఇరాన్ అణుసామర్థ్యాన్ని సంతరించుకోకుండా చూడటం చాలా ముఖ్యమని చెప్పారు. అమెరికాలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వంతో కలిసి ఇరాన్ అణుస్థావరాలు, ఇతర ముప్పులపై దాడిచేసే సామర్థ్యాలను పరీక్షిస్తామని నెతన్యాహు వెల్లడించారు.
ఏ రకంగా దాడులు చేస్తాం, మా పాలసీ ఏమిటి అనేది ఇప్పుడే బహిర్గతం చేయమని, కొత్త అధ్యక్షుడు ఆఫీస్‌లోకి వచ్చేందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. బైడెన్ పాలన చివరి రోజుల్లో అమెరికా నుంచి వచ్చే సూచనలన్నీ పాటిస్తామని కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు. బైడెన్ కార్యవర్గం చాలాసార్లు షరతులు విధించిందని నెతన్యాహు గుర్తు చేశారు. బైడెన్ తీరుపై అసంతృప్తి వెల్లగక్కారు.