వాషింగ్టన్, జూన్ 22: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో తాజాగా అమెరికా కూడా చేరింది. ఆదివారం టెహ్రాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై కచ్చితమైన బాంబు దాడులతో విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్‌లోని అణు కేంద్రాలపై జరిపిన ఈ దాడుల కోసం అమెరికా తమ అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది. వాటిలో బీ-2 బాంబర్లు, భయంకరమైన జీబీయూ-57 బంకర్ బస్టర్లు, తొమహాక్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. వాటి వివరాలు ఇవీ..
అమెరికా అమ్ములపొదిలోని అత్యాధునిక, వ్యూహాత్మక ఆయుధాల్లో ఒకటైన బీ-2 బాంబర్లు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను సైతం ఏమార్చి కచ్చితమైన దాడుల (ప్రెసిషన్ అటాక్స్)తో విరుచుకుపడగలవు. 40 వేల పౌండ్ల (18 వేల కిలోల) మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలిగే ఈ ‘రాకాసి’ యుద్ధ విమానాలు అత్యంత రక్షణ కలిగిన లక్ష్యాలను సైతం నాశనం చేయగలవు. స్టెల్త్ ఫీచర్లను కలిగి ఉండే ఈ బాంబర్లను గుర్తించడం, ట్రాక్ చేయడం, ప్రతిఘటించడం చాలా కష్టం. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న సైనిక విమానాల్లో ఇదే అత్యంత ఖరీదైనది. ఒక్కో బీ-2 బాంబర్ ఖరీదు దాదాపు 210 కోట్ల డాలర్లు (రూ.18,182 కోట్లు). నార్త్రోప్ గ్రమ్మన్ కంపెనీ తయారు చేసిన ఈ భారీ, లాంగ్-రేంజ్ బాంబర్ మార్గం మధ్యలో ఇంధనాన్ని నింపుకోకుండా ఏకబిగిన దాదాపు 7 వేల మైళ్లు (11 వేల కిలోమీటర్లు), ఒకసారి రీఫ్యూయలింగ్‌తో 11,500 మైళ్లు (18,500 కిలోమీటర్లు) ప్రయాణించగలదు. ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కేవలం గంటల వ్యవధిలోనే చేరుకోగలదు.
జీబీయూ-57 అనేది 30 వేల పౌండ్ల (దాదాపు 13,600 కిలోల) బరువుండే భారీ బాంబు. పేలిపోయే ముందు ఇది భూగర్భంలో 200 అడుగుల (దాదాపు 61 మీటర్ల) లోతుకు చొచ్చుకుపోతుంది. అందుకే దీనికి ‘బంకర్ బస్టర్’ అనే పేరు వచ్చింది. అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్లలో ఇదే అత్యంత శక్తివంతమైనది. దాదాపు 20 అడుగుల పొడవు, 2.6 అడుగుల వ్యాసం ఉండే ఈ అధునాతన ఆయుధాన్ని బోయింగ్ సంస్థ డిజైన్ చేయగా.. ఎయిర్‌ఫోర్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన మ్యునిషన్స్ డైరెక్టరేట్ అభివృద్ధి చేసింది. ఆదివారం ఇరాన్‌పై జరిపిన దాడుల్లో అమెరికా 12 బంకర్ బస్టర్లను ఉపయోగించినట్టు తెలుస్తున్నది.
లోతైన భూతల దాడులకు ఉపయోగించే ఈ దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణిని అమెరికా నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. ఉపగ్రహం నుంచి అందే సమాచారం ఆధారంగా మార్గం మధ్యలో లక్ష్యాలను మార్చుకోగలిగే ఈ క్షిపణి 1970వ దశకంలో ప్రచ్ఛన్న యుద్ధం వేళ తొలిసారి తెరపైకి వచ్చింది. జనరల్ డైనమిక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ మిసైల్ 1983 నాటికి అమెరికా సైన్యం చేతికి వచ్చింది. ‘ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్’ పేరిట ఇరాక్‌పై 1991లో అమెరికా జరిపిన యుద్ధంలో తొలిసారి వినియోగించిన తొమహాక్ క్షిపణులను ఆ తర్వాత లిబియాలో జరిగిన ఆపరేషన్ ‘ఒడిస్సీ డాన్’, సిరియాలో జరిగిన ఆపరేషన్ ‘ఇన్హెరెంట్ రిజాల్వ్’లో కూడా ఉపయోగించారు.
ఇరాన్‌పై దాడులకు అమెరికా ఎఫ్-22 రాప్టర్, ఎఫ్-35ఏ లైట్నింగ్ యుద్ధ విమానాలను కూడా ఉపయోగించినట్టు తెలుస్తున్నది. స్టెల్త్, సూపర్ క్రూయిజ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్ ఫీచర్లతో మిళితమై ఉండే ఎఫ్-22 రాప్టర్‌ను వేగంగా, దూరంగా గగనతల ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు, అమెరికా దాడిని అడ్డగించేందుకు జరిగే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రూపొందించబడింది. కాగా, ఎఫ్-35ఏ లైట్నింగ్ ఫైటర్ అనేది అమెరికా వాయుసేనలోని ఐదో తరం యుద్ధ విమానం. అత్యాధునిక స్టెల్త్ సామర్థ్యాలను కలిగి ఉండే ఈ విమానాన్ని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో దాడులు నిర్వహించేందుకు అనువుగా రూపొందించారు. 51 అడుగుల పొడవు, 35 అడుగుల వింగ్స్పాన్ (రెక్కల వెడల్పు) ఉండే ఈ ఫైటర్ 8 వేలకుపైగా కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.