Israel | ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం (Israel – Hamas War)తో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుపడుతోంది. రెండు రోజుల క్రితం గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుపడింది.
తాజా దాడుల్లో ఓ మహిళ, పిల్లలు సహా కనీసం 70 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా పౌర రక్షణ సంస్థను ఊటంకిస్తూ అల్‌జజీరా నివేదించింది. ఇజ్రాయెల్ దళాలు గాజాలోకి ప్రవేశించి ఉత్తర, దక్షిణ గాజాను విభజించే నెట్జారిమ్ కారిడార్‌లోని కొంత భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఇక్కడినుంచి పాలస్తీనావాసుల కదలికలను నియంత్రించే వెసులుబాటు దానికి దక్కింది.
గాజా కారిడార్‌లో అత్యంత కీలకమైన కొంతభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పరిమితస్థాయి ‘గ్రౌండ్ ఆపరేషన్’ చేపట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ప్రకటించింది. బందీలను హమాస్ విడిచిపెట్టకపోతే, ఊహించలేని స్థాయిలో దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణమంత్రి హెచ్చరించారు.
కాగా, గాజా స్ట్రిప్‌పై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 404 మంది ప్రాణాలు కోల్పోయారని, 500 మందికిపైగా గాయపడ్డారని గాజా వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న తరుణంలో ఇజ్రాయెల్ అనూహ్యంగా ఈ దాడులకు దిగింది. దీంతో ఏడాదిన్నరగా సాగిన యుద్ధం మళ్లీ ప్రజ్వరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఇటలీ, ఖతార్ సహా పలు దేశాలు ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి.
Also Read..
Israel | గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 400 మందికి పైగా మృతి
White House | గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. అమెరికా రియాక్షన్ ఇదే
Israel – Hamas War | గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 300 దాటిన మృతుల సంఖ్య