Israel | డేర్ అల్ బలాహ్ (గాజా స్ట్రిప్): పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. గాజా స్ట్రిప్‌పై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 404 మంది ప్రాణాలు కోల్పోయారని, 500 మందికిపైగా గాయపడ్డారని గాజా వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. జనవరి నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న తరుణంలో ఇజ్రాయెల్ అనూహ్యంగా ఈ దాడులకు దిగింది. దీంతో ఏడాదిన్నరగా సాగిన యుద్ధం మళ్లీ ప్రజ్వరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఇటలీ, ఖతార్ సహా పలు దేశాలు ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి.
అందుకే దాడులు..
కాల్పుల విరమణ ఒప్పందాన్ని మార్చాలన్న ఇజ్రాయెల్ డిమాండ్లను హమాస్ తిరస్కరించడంతో ఈ వైమానిక దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఇక యుద్ధం కొనసాగే అవకాశం ఉందని వారు చెప్పారు. దాడులు జరపడానికి ముందు ఇజ్రాయెల్ తమను సంప్రదించిందని, ఇందుకు తమ మద్దతు తెలియచేశామని అమెరికా వెల్లడించింది. బీట్ హనౌన్ పట్టణంతో సహా తూర్పు గాజాలోని ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయవలసిందిగా ఇజ్రాయెలీ సైన్యం ఆదేశించింది. ఇక గాజా స్ట్రిప్ మధ్య భాగం నుంచి తన ఆపరేషన్ కొనసాగించడానికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేసుకుంటోంది. రెట్టింపు సైనిక బలంతో హమాస్‌ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కార్యాచరణ చేపడుతుందని ప్రధాని నెతన్యాహూ కార్యాలయం ప్రకటించింది.
బందీల భవితవ్యం ఏమిటో?
ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో జరిగిన ఈ దాడితో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే వేలాదిమంది పాలస్తీనీయులు యుద్ధంలో మరణించారు. అయితే, ఇప్పటికీ హమాస్ చెరలో బందీలుగా ఉన్న పాతిక మంది ఇజ్రాయెలీ పౌరుల భవితవ్యం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ యుద్ధం మొదలుపెట్టాలని నెతన్యాహూ తీసుకున్న నిర్ణయం ఇజ్రాయెలీ బందీలకు మరణ శాసనమని హమాస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నెతన్యాహూ ఈ చర్యకు దిగుతున్నారని, ఎవరు ఒప్పందాన్ని ఉల్లంఘించారో మధ్యవర్తులు వాస్తవాలు బహిర్గతం చేయాలని అధికారి కోరారు. మంగళవారం దాడులలో నలుగురు హమాస్ సీనియర్ అధికారులు మరణించారని ఆయన చెప్పారు. కాగా, ఇజ్రాయెల్ దాడులు జరిగిన కొన్ని గంటలైన తర్వాత కూడా హమాస్ నుంచి ఎటువంటి దాడులు జరిగినట్టు వార్తలు రాలేదు. కాల్పుల విరమణ ఒప్పందం అమలు జరుగుతుందని హమాస్ ఇప్పటికీ ఆశిస్తోందని ఆ అధికారి చెప్పారు.
హమాసే కారణం: అమెరికా
యుద్ధం మళ్లీ రాజుకోవడానికి హమాస్ కారణమని వైట్ హౌస్ నిందించింది. కాల్పుల విరమణ కొనసాగించడానికి వీలుగా బందీలను హమాస్ వదిలిపెట్టి ఉండవలసిందని, కానీ బందీలను విడుదల చేయడానికి హమాస్ నిరాకరించడంతోనే యుద్ధం మళ్లీ మొదలైందని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బ్రియాస్ హగ్స్ తెలిపారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌కు అపరిమిత రాజకీయ, సైనిక సహకారం అందచేస్తున్న అమెరికానే.. గాజాలో జరుగుతున్న మారణకాండకు పూర్తిగా బాధ్యత వహించాలని హమాస్ ఆరోపించింది. ఇజ్రాయెల్ పాల్పడుతున్న దురాక్రమణలో సహకరిస్తున్న ట్రంప్ ప్రభుత్వం మళ్లీ మారణహోమం రగల్చడానికి కారణమైందని హమాస్ పేర్కొంది.
హమాస్ ప్రభుత్వాధినేత మృతి
గాజాలో తమ ప్రభుత్వాధినేత ఇస్సామ్ అల్ దాలిస్తోసహా చాలా మంది తమ ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిట్టు హమాస్ ప్రకటించింది. మృతులలో అంతర్గత భదత్రా శాఖ అధిపతి మహమూద్ అబూ వత్ఫా, అంతర్గత భద్రతా సర్వీసు డైరెక్టర్ జనరల్ బహజట్ అబూ సుల్తాన్ కూడా ఉన్నట్టు తెలిపింది.