గాజా : గాజాలో శాంతి మూడునాళ్ల ముచ్చటగా మిగిలే పరిస్థితి తలెత్తింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పతనం అంచుకు చేరుకుంది. ఆదివారం రఫాలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ బలగాలపై దాడులకు దిగగా, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక, ఫిరంగి దళంతో దాడులు నిర్వహించింది. ఒప్పందం ఉల్లంఘనపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. దీంతో శాంతి ఒప్పందం రద్దుపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అత్యవసరంగా రక్షణ మంత్రి కట్జ్, ఐడీఎఫ్ చీఫ్ జనరల్ ఇయల్ జమీర్‌తో చర్చలు జరిపారు. ఈ దాడులు తీవ్ర ఒప్పంద ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఎలాంటి కాల్పుల విరమణను ఉల్లంఘించినా గట్టి చర్య తీసుకోవాలని ఆదేశించారు. గాజా, ఈజిప్ట్ మధ్య రఫా సరిహద్దు క్రాసింగ్‌ను తదుపరి నోటీస్ వచ్చేవరకు మూసివేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. రఫాను తిరిగి తెరవడం లేదని, మరణించిన 28 మంది బందీల మృతదేహాల అప్పగింతలో, తన కాల్పుల విరమణ పాత్రను హమాస్ ఎంత సమర్థంగా నెరవేరుస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుందని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. కాగా, దక్షిణ గాజాలోని రఫాలో జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని హమాస్ స్పష్టం చేసింది. రెండో విడత కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపింది.
తొలుత హమాసే తమపై దాడి చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇజ్రాయెల్ మీడియా కథనం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భద్రతా బలగాల ఇంజనీరింగ్ వాహనాలపై యాంటీ ట్యాంక్ క్షిపణిని ప్రయోగించారు. దీంతో ఇజ్రాయెల్ విమానాలు హమాస్‌పై ప్రతి దాడికి దిగాయి. అంతేకాకుండా ఐఈడీల పేలుళ్ల కారణంగా పలువురు సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. కాగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ, బందీల అప్పగింత ఒప్పందం జరిగింది. ఇది జరిగి కొద్ది రోజులకే ఈ దాడులు చోటుచేసుకోవడంతో ఒప్పంద ఉల్లంఘన జరిగినట్టేనని భావిస్తున్నారు. ఈసారి హమాస్ పూర్తి నిర్మూలనకు నెతన్యాహు కంకణం కట్టుకుంటారని, భవిష్యత్‌లో ఒప్పందాల జోలికి వెళ్లకపోవచ్చునని ఒక వార్తా సంస్థ పేర్కొంది.
హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం గాజాలో నివసిస్తున్న పాలస్తీనా పౌరులపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్‌తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి హమాస్ ప్రణాళిక వేస్తున్నదని అమెరికా హోం శాఖ ఆరోపించింది. అలాంటి దాడికి పాల్పడితే గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించినట్టేనని పేర్కొంది. ట్రంప్ మధ్యవర్తిత్వం వల్ల రెండేళ్ల సంక్షోభానికి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా తెరపడిందని, ఒప్పందం అమలులో ఉండగా, ఇప్పుడు హమాస్ పౌరులపై దాడికి దిగితే అది తీవ్ర ఉల్లంఘన అవుతుందని, అలా చేస్తే గాజా పౌరుల రక్షణ కోసం అమెరికా బలవంతపు జోక్యం తప్పదని తెలిపింది. అమాయకపు పౌరులపై దాడి చేయాలనే ఆలోచనను హమాస్ తక్షణం విరమించుకోవాలని అమెరికా హెచ్చరించింది. అయితే దీనిపై అమెరికా తర్వాత వివరణ ఇస్తూ అమెరికా దళాలు గాజాలో మోహరించబోమని స్పష్టం చేసింది. దగ్గరలో ఉన్న ఇతర భద్రతా దళాలను పర్యవేక్షించడం ద్వారా పరిస్థితిని అదుపుచేస్తామని తెలిపింది. కాగా, అమెరికా హెచ్చరికలపై హమాస్ నేరుగా స్పందించ లేదు. అయితే పౌరులను లక్ష్యంగా దాడులు చేస్తామన్న యూఎస్ ఆరోపణలను అంతకుముందు తిరస్కరించింది. ఆయుధాల విడిచిపెట్టమని ఇప్పటికే స్పష్టం చేసిన హమాస్ గాజాలో భద్రతా నియంత్రణపై తమ సంస్థ దృష్టి పెడుతున్నట్టు తెలిపింది. కాగా, గాజాలో శాశ్వత శాంతి కోసం అన్ని పార్టీలు కృషి చేయాలని ఐరాస విజ్ఞప్తి చేసింది.