Israel | టెల్ అవీవ్ : సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడితో విరుచుకుపడింది. తీరప్రాంత నగరమైన టార్టస్పై ఈ దాడి జరిగిందని, ఈ సందర్భంగా భారీ పేలుళ్లతో ఆ ప్రాంతం కంపించిపోయిందని యుద్ధాలను పర్యవేక్షించే ఓ గ్రూపు వెల్లడించింది. ఆ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైందని, ఈ ప్రకంపనలను దాదాపు 820 కి.మీ. దూరంలో ఉన్న టర్కీ పశ్చిమ ప్రాంత నగరం ఇస్నిక్లోని భూకంప సెన్సర్లు సైతం గుర్తించాయని తెలిపింది. టార్టస్‌లోని గగనతల రక్షణ యూనిట్లు, ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలపై ప్రయోగించే క్షిపణుల డిపోలు సహా పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఈ దాడులు జరిపాయని, 2012 తర్వాత సిరియా తీరప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన అత్యంత భీకర దాడి ఇదేనని ఆ గ్రూపు పేర్కొన్నది.
గాజా స్ట్రిప్‌లో హమాస్-ఇజ్రాయెల్ మధ్య 14 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో మృతుల సంఖ్య 45 వేలకు చేరుకుంది. తాజాగా ఆది, సోమవారాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 75 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో మహిళలు, పిల్లల సంఖ్య సగానికి కన్నా ఎక్కువగా ఉందని తెలిపింది.
అంతర్యుద్ధం సమయంలో గత సిరియా పాలకులు వేల కోట్ల ధనాన్ని రష్యాకు తరలించుకుపోయారు. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో అప్పటి సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ దాదాపు రూ. 2,100 కోట్ల ధనాన్ని(250 మిలియన్ డాలర్లు) మాస్కోకు బదిలీ చేసినట్లు తెలుస్తున్నది. రెండు టన్నుల బరువున్న 100 డాలర్లు, 500 డాలర్ల నోట్ల కట్టలు సిరియా సెంట్రల్ బ్యాంకు నుంచి మాస్కోలోని విన్కోవో ఎయిర్‌పోర్టు తరలిపోగా రష్యన్ బ్యాంకులలో వాటిని డిపాజిట్ చేసినట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. పశ్చిమ దేశాల నుంచి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సిరియా ఈ ధనాన్ని రష్యాలో భద్రపరిచినట్లు తెలుస్తున్నది. విదేశీ కరెన్సీ కొరతను ఎదుర్కొంటున్న సిరియాకు రష్యా ఆర్థిక జీవనాడిగా మారింది. సిరియాలో అంతర్యుద్ధం కొనసాగడం, పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా సిరియా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులలో ఈ నగదు బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.
డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైనప్పటికీ తాను దేశం విడిచి పారిపోవాలనుకోలేదని.. అయితే రష్యా సైన్యం తనను తరలించిందని సిరియా బహిష్కృత అధ్యక్షుడు బషర్ వెల్లడించారు. తనను తిరుగుబాటుదారులు తరిమికొట్టడంపై ఆయన మొదటిసారిగా స్పందించారు. రష్యా సహకారంతో లటాకియా తీర ప్రాంతంలోని రష్యా స్థావరం నుంచి పోరాటం కొనసాగించాలని తాను భావించానన్నారు.