టెల్ అవీవ్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించనప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. దక్షిణ లెబనాన్‌లోని పట్టణాలపై శుక్రవారం మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగినట్టు లెబనాన్ ఆరోపించింది. దీంతో ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు పొడువునా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడులకు ప్రతీకారంగా హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు జరిపింది. ఇజ్రాయెల్ పౌరులు నివసించే మిస్గావ్పై రాకెట్ దాడి చేసినట్లు ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్, దేశ ప్రజల ఆత్మరక్షణ కోసం ఈ దాడులు జరిపినట్లు హెజ్బొల్లా వర్ణించింది.
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు, దక్షిణ లెబనీస్ గ్రామాలపై నిరంతర దాడులకు సమాధానంగా ఈ దాడి చేసినట్లు పేర్కొన్నది. ఒకే లక్ష్యంపై ఇది రెండవ దాడిగా పేర్కొన్న హెజ్బొల్లా లెబనాన్‌పై దాడులు కొనసాగినంత కాలం తమ ప్రతిదాడులు ఆగవని హెచ్చరించింది. దీనిపై ఇజ్రాయెల్ నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన లేదు. ఇలా ఉండగా ఇజ్రాయెల్‌తో చర్చలకు కాల్పుల విరమణ తమ ముందస్తు షరతుగా లెబనాన్ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.