Israel Strike | లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. సెంట్రల్ బీరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 117 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రులను అమెరికన్ యూనివర్సిటీ ఆసుప్రతికి తరలించారు. ఇక మృతుల్లో ఇద్దరు హిజ్బొల్లా టాప్ కమాండర్లు ఉన్నట్లు సమాచారం. కమాండర్ల మృతిపై హిజ్బొ్ల్లా మీడియా కార్యాలయం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్ బచౌర ప్రాంతంలోని దాడులకు దిగింది. హిజ్బొల్లా కమాండర్లను హతమార్చడంతో పాటు ఆయుధాలను ధ్వంసం చేసేందుకు దక్షిణ శివారు ప్రాంతమైన దహీమ్ వెలుపల నగరంపై వైమానిక దాడులు చేయడం ఇది మూడోసారి. పేలుళ్లకు పక్కనే ఉన్న భవనంలో తాను ఉన్నానని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆసుపత్రి వెలుపల ఉన్న ఒక మహిళ చెప్పారు. దాడికి గురైన భవనం పూర్తిగా నివాస భవనమని.. నాలుగైదు అంతస్తులు ఉంటుందని చెప్పారు.
తన బంధువు ఒకరికి తలకు గాయమై చికిత్స పొందుతున్నారన్నారు. హిజ్బుల్లా గురువారం లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌లోకి దాదాపు 190 రాకెట్లను ప్రయోగించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. గురువారం తూర్పు లెబనాన్‌లోని కరక్ గ్రామంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో నలుగురు మరణించారని లెబనీస్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత సంవత్సరంలో 1.2 మిలియన్ల మంది జనం ఇండ్లను విడిచివెళ్లినట్లుగా లెబనాన్ ప్రభుత్వం పేర్కొంది. అక్టోబర్ ఒకటిన ఇరాన్ చేసిన దాడిపై సైతం ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ చర్చలు జరుపుతున్నది. ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశంలో ఇరాన్‌పై దాడి అంశాన్ని పరిశీలించాల్సి అవకాశం ఉన్నది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. దాదాపు 50 రోజుల తర్వాత ఇద్దరి మధ్య చర్చలు సాగాయి. ఇరాన్‌పై దాడి చేసే అంశంపై చర్చినట్లు సమాచారం.