Pakistan | ఇస్లామాబాద్, మే 1: పాకిస్థాన్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేశారా? భారత్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో విధాన నిర్ణయమంతా సైన్యం, ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిపోయిందా అన్న అనుమానాలు గురువారం నాటి పరిణామాలతో వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లో ఇప్పటికే పాక్షిక తిరుగుబాటు ప్రారంభమైంది.
ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని డమ్మీగా మార్చినట్టు ప్రచారం జరుగుతున్నది. బలహీన ప్రధానిగా పేరు తెచ్చుకున్న షెహబాజ్ మొదటి నుంచి సైన్యం చెప్పుచేతల్లోనే ఉన్నారు. దానిలో భాగంగానే ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న మహమ్మద్ అసిమ్ మాలిక్ తాజాగా పాకిస్థాన్ జాతీయ రక్షణ సలహాదారునిగా నియమితులయ్యారు. ఆయన పాకిస్థాన్ 10వ ఎన్ఎస్ఏ కాగా, ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికి ఈ పదవి ఇవ్వడం, ఒకేసారి రెండు ప్రధాన పదవులకు ఒకే వ్యక్తిని నియమించడం ఇదే తొలిసారి.
మాలిక్ ఐఎస్ఐ డీజీగా 2024 అక్టోబర్‌లో నియమితులయ్యారు. పాకిస్థాన్‌లో 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి ఎన్ఎస్ఏ పోస్టు ఖాళీగా ఉంది. తాజా నియామకంతో ఆర్మీ-ఐఎస్ఐ సంయుక్తంగా దేశంలో అధికారంపై పట్టు సాధించాయని భావిస్తున్నారు. కాగా, పాకిస్థాన్ ప్రజాస్వామ్య దేశమేనని నమ్మించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తుండగా, అధికారం మాత్రం సైన్యం చేతిలో ఉందన్నది స్పష్టమవుతున్నది.
గత కొన్ని రోజులుగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ బహిరంగ కార్యక్రమాల్లో కన్పించకపోవడం, యుద్ధానికి సంబంధించిన కీలక ప్రకటనలు సైతం ఆయన నుంచి వెలువడకపోవడం చూస్తుంటే ముఖ్యమైన నిర్ణయాల్లో ఇప్పటికే ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో విపక్ష నేత కూడా జైలులో ఉండటంతో ఇక అడిగే వారే లేకుండా పోయారు. దీంతో జాతీయ భద్రత, భారత్ చర్యలపై ప్రతిస్పందన ఇప్పుడు జనరల్ అసిఫ్ మునీర్, అసిమ్ మాలిక్‌ల చేతిలోకి వెళ్లిపోయిందని సమాచారం. వాస్తవానికి ఇది అధికార మార్పిడి కాదని పాకిస్థాన్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
చాలాకాలంగా తిరస్కరిస్తూ వస్తున్నప్పటికీ నిరంతరం పాటిస్తున్న వాస్తవ సైనిక పాలన అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అసలే పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం అంతంత మాత్రమని, ఇప్పుడు ఆ ముసుగు కూడా తొలగిపోయిందని వారు పేర్కొన్నారు. కాగా, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌లో మిలిటరీ తిరుగుబాట్లు కొత్తేం కాదు. మొదటి నుంచి సైనిక వర్గాలే ఆధిపత్య పాత్రను పోషిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచినప్పుడు కూడా విదేశాంగ విధానం, అంతర్గత భద్రత, వ్యూహాత్మక నిర్ణయాల విషయంలో ఆర్మీ-ఐఎస్ఐలే విధాన నిర్ణయ శక్తులుగా వ్యవహరించి బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేశాయి.
భారత్ తమ మీద దాడులు చేయొచ్చన్న భయంతో ఉన్న పాకిస్థాన్ సరిహద్దుల వద్ద తన బలగాల మోహరింపును ముమ్మరం చేసింది. మరోవైపు తన ప్రధాన యుద్ధ విమానాలతో ఏక కాలంలో సాధన మొదలు పెట్టింది. సైనికులకు శిక్షణ కూడా మొదలుపెట్టింది. విమానాశ్రయాల దగ్గర ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందిని నియమించింది. రాజస్థాన్‌లోని లాంగెవాలా సెక్టార్ వద్ద పాక్ రాడార్ వ్యవస్థను, సైనిక, వైమానిక బలగాలను మోహరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తన ఆర్మీ యూనిట్లను, నౌకా దళాన్ని భారత్ సరిహద్దుల వద్దకు పాక్ తరలిస్తున్నది.
భద్రతా కారణాల రీత్యా ఈ నెలంతా కరాచీ, లాహోర్ గగన తలాల వినియోగంపై పాక్ సర్కారు పాక్షికంగా ఆంక్షలు విధిస్తున్నట్టు ఓ మీడియా నివేదిక గురువారం వెల్లడించింది. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ‘నిషేధిత గగనతలంపై ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి’ అని అధికారిక ప్రకటన పేర్కొంది. అయితే వాణిజ్య విమానాల రాకపోకలకు ఈ ఆంక్షలు వర్తించబోవని పౌర విమానయాన సంస్థ తెలిపింది. ఆంక్షల సమయంలో వాణిజ్య విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తామని చెప్పింది.