Russia : పాకిస్థాన్ (Pakistan) యుద్ధ విమానాల (Fighter Jets) కోసం రష్యా (Russia) జెట్ ఇంజిన్ల (Engines) ను సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను మాస్కో (Mascow) కొట్టి పారేసింది. ఆ దేశంతో అలాంటి ఒప్పందం తాము చేసుకోలేదని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌తో పెద్దఎత్తున వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న సమయంలో.. పాకిస్థాన్‌కు తాము జెట్ ఇంజిన్లను సరఫరా చేస్తున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. భారత్‌కు ఇబ్బందికరంగా మారే ఏ చర్యలు తాము చేపట్టబోమని స్పష్టంచేశారు.
అయితే ఈ విషయంపై రష్యా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పాకిస్థాన్‌లో ఉన్న చైనా తయారీ JF-17 ఫైటర్ జెట్లలో వాడే ఇంజిన్లను రష్యా సరఫరా చేస్తోందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దాంతో అంతర్జాతీయ మీడియా నివేదికలను ఉటంకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది.
ప్రధాని మోదీ రష్యాను అత్యంత సన్నిహితమైన వ్యాపార భాగస్వామిగా చెబుతారని, కానీ ఆ దేశం మన శత్రు దేశమైన పాకిస్థాన్‌కు మద్దతునిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఇది ఇతర దేశాలతో సంబంధాల విషయంలో ప్రధాని మోదీ వైఫల్యాన్ని సూచిస్తోందని విమర్శించారు. మోదీ సర్కారు పాకిస్థాన్‌ను ఒంటరిని చేయలేకపోతోందని మండిపడ్డారు.