వాషింగ్టన్, డిసెంబర్ 18 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడమే కాక, అతని తరపున స్వయంగా ప్రచారం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు ఇతర దేశాల ఎన్నికల్లో సైతం తన ప్రభావాన్ని చూపాలనుకుంటున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మారాలనుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అందులో భాగంగా ఆయన తొలుత యూకేపై దృష్టి సారించారు. మంగళవారం యూకే సంస్కరణల నేత నిగెల్ ఫరాజ్‌ను కలిసారు. మస్క్ ఆయనను కేవలం ప్రచారం కోసం మాత్రమే కలవలేదని, ఫరాజ్‌కు రానున్న ఎన్నికల్లో ఆయన మిలియన్ డాలర్ల విరాళాన్ని ఇవ్వనున్నారని యూకే టెలిగ్రాఫ్ ఒక వార్తా కథనంలో పేర్కొంది. ‘మస్క్ మా వెనుక ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. విరాళాలకు సంబంధించి ఆయనతో చర్చలు జరుగుతున్నాయి’ అని ఫరాజ్ టెలిగ్రాఫ్‌కు తెలిపారు. ‘గ్లోబల్ కింగ్ మేకర్’ గా మారుదామనుకుంటున్నారని టెలిగ్రాఫ్ పేర్కొంది.