Israel-Iran | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) ఎనిమిదో రోజుకు చేరింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. ప్రతిగా క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి టెహ్రాన్ ఎక్కుపెట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఇక ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ఒంటరైంది. ఈ క్రమంలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తున్నట్లు (China secretly helping Iran) తెలిసింది. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా ఆయుధాలు పంపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మూడు మిస్టరీ కార్గో విమానాలను టెహ్రాన్‌కు పంపినట్లు తెలిసింది. ఈనెల 14 నుంచి మూడు బోయింగ్-747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి టెహ్రాన్ వైపు వెళ్లినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.
పలు నివేదికల ప్రకారం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట గత శుక్రవారం దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే అంటే శనివారం తొలి బోయింగ్ విమానం ఇరాన్‌వైపు వెళ్లింది. ఆ తర్వాత ఆదివారం రెండో విమానం, సోమవారం మూడో బోయింగ్ విమానం చైనా నుంచి బయల్దేరి వెళ్లాయి. ఈ రకమైన బోయింగ్ 747లను భారీ సైనిక పరికరాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ మూడు విమానాలూ కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ వైపు నుంచి ఇరాన్ సమీపంలోని వెళ్లాయి. ఆ తర్వాత అవి రాడార్ నుంచి కనిపించకుండా పోయాయి. మూడు విమానాల తుది గమ్యస్థానం లక్సెంబర్గ్గా ఉన్నప్పటికీ అవి అక్కడికి వెళ్లలేదు. దీంతో అవి ఇరాన్ వైపు వెళ్లి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా కార్గో విమానాల్లో సైనిక పరికరాలు సాయంగా పంపుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read..
Air India: ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. పుణె-ఢిల్లీ రిట్నర్ జర్నీ రద్దు
Israel Iran War | ఎనిమిదో రోజుకు చేరిన యుద్ధం.. ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులతో విరుచుకుపడిన ఇరాన్