ఇరాన్‌లోని అరాక్ భార జల పరిశోధనా రియాక్టర్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ గురువారం ధ్రువీకరించింది. క్షిపణి దాడి జరిగిన సమయంలో అరాక్ రియాక్టర్ అణు సామర్థ్యాన్ని కలిగి లేదని, రేడియోధార్మిక విషవాయువు ముప్పు ఏదీ ప్రజలకు లేదని టీవీ ప్రకటించింది. ఈ దాడి జరగడానికి ముందుగానే అణు కేంద్రాన్ని ఖాళీ చేసినట్లు తెలిపింది. కాగా తాము అరాక్ రియాక్టర్‌పై దాడి చేయనున్నామని, ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని గురువారం తెల్లవారుజామునే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీచేసింది.
రియాక్టర్ కేంద్రం నిర్వహ ణలో లేదని, అణు పదార్థం కాని, రేడియోధార్మిక ప్రభావం కాని ఏమీ లేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) వెల్లడించింది. రియాక్టర్ని ఆనుకునే ఉన్న భార జల కర్మాగారంపై దాడి జరిగిన విషయం గురించి తమకు సమాచారం అందంచలేదని ఐఏఈఏ తెలిపింది. కాగా, అరాక్ రియాక్టర్‌పై తాము జరిపిన క్షిపణి దాడి ఫొటోలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. రియాక్టర్ భవనంపైన బాంబు పడుతున్న దృశ్యాలు, భారీ పేలుడు కారణంగా మంటలు ఏర్పడి దట్టమైన పొగ వ్యాపించిన దృశ్యాలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. యురేనియం ఉత్పత్తి కోసం అరాక్ రియాక్టర్‌ను ఉపయోగించకూడదన్న ఉద్దేశంతోనే దానిపై తమ ఫైటర్ జెట్లు దాడి జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.