టెహ్రాన్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) ఎనిమిదో రోజుకు చేరింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. ప్రతిగా క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి టెహ్రాన్ ఎక్కుపెట్టింది. గత వారం రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ క్లస్టర్ మందుగుండు సామాగ్రిని ఉపయోగించడం ఇదే తొలిసారి. దీంతో ఎనిది రోజులుగా జరుగుతున్న దాడులు, ప్రతిదాడుల పరంపర ఎప్పుడు ఆగుతుందో తెలియన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబులను ఉపయోగించడం, దవాఖానపై దాడి చేయడం వంటి ఘటనల నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యే ఉవకాశాలు ఉన్నాయి. దీనికి తగినట్లుగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటన జారీచేశారు. ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బకొడతామని హెచ్చరించారు.
గురువారం తెల్లవారుజామున దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓ ప్రధాన దవాఖానపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తీవ్రమైన గాయాలు ఎవరికీ కాలేదని దవాఖాన యాజమాన్యం ప్రకటించింది. కాగా, టెల్ అవీవ్ సమీపంలోని అనేక బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నివాస భవనాలపై ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడులలో కనీసం 47 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ మాగెన్ డేవిడ్ ఆడమ్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. బీర్షేబా నగరంలోని సొరోకా వైద్య కేంద్రంపై క్షిపణి దాడి జరగడంతో దట్టమైన నల్లని పొగ ఆ ప్రాంతంలో వ్యాపించింది. దవాఖానలోని రోగులను ఎమర్జెన్సీ బృందాలు వేరే దవాఖానలకు తరలించాయి.
ఖమేనీ బతకడానికి వీల్లేదు..
ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ బతకడానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. టెల్ అవీవ్ సమీపంలోని ఓ దవాఖానపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంపై గురువారం ఆయన తీవ్రంగా స్పందించారు. దవాఖానపై జరిగిన క్షిపణి దాడికి ఖమేనీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బంకర్లో తలదాచుకున్న ఇరానియన్ నియంత ఇజ్రాయెల్‌లోని దవాఖానలు, నివాస భవనాలపై పిరికిపందలా క్షిపణులతో దాడులు చేస్తున్నారని కట్జ్ ఆరోపించారు. ఇవి చాలా తీవ్రమైన యుద్ధ నేరాలని, ఈ నేరాలకు ఖమేనీని జవాబుదారీగా నిలబెడతామని హెచ్చరించారు. ఖమేనీని అంతం చేయడానికి ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఖమేనీ పాలనను అంతం చేసేందుకు దాడులను ముమ్మరం చేయాలని తాను, ప్రధాని నెతన్యాహు ఐడీఎఫ్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.