బీరుట్: దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Israel) చేస్తున్న దాడులు లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. నెతన్యాహూ సైన్యం దాడుల్లో హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చి కోలుకోలేని దెబ్బకొట్టింది. మరోవైపు లక్ష్యం నెరవేరేవరకు దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ (Iran) కీలక నిర్ణయం తీసుకున్నది. నస్రల్లా మృతి, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కావాలని కోరింది. దీంతో భద్రతా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాగా, ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరూషన్ కూడా మరణించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ తమ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే నస్రల్లా మరణం లెబనాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
అసలు ఎవరీ హసన్ నస్రల్లా?
లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణలో హసన్ నస్రల్లా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా సిరియన్ అంతర్యుద్ధంలో హెజ్బొల్లా తరఫున పోరాటం జరిపి అధ్యక్షుడు బషర్ అస్సద్ స్థానాన్ని బలీయం చేయడానికి సహాయం చేశాడు. ఇరాన్‌తో పాటు హమాస్ వంటి సంస్థల నేతలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని హెజ్బొల్లాను ఇజ్రాయెల్‌కు ప్రధాన ప్రత్యర్థిగా తయారు చేశాడు. బీరుట్‌లోని పేద కుటుంబంలో 1960లో జన్మించిన నస్రల్లా 16 ఏండ్లకే షియా రాజకీయ, పారా మిలటరీ గ్రూప్‌లో చేరారు. ఆ తర్వాత హెజ్బొల్లా తీవ్రవాద సంస్థలో కీలక పాత్ర పోషించారు. 1992లో అప్పటి హెజ్బొల్లా అధ్యక్షుడి హత్య తర్వాత ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. 34 రోజుల పాటు ఇజ్రాయెల్‌తో జరిగిన ఘర్షణ తర్వాత ఆ దేశాన్ని అడ్డుకోవడంలో సఫలీకృతుడు కావడంతో అరబ్ దేశాల్లోనూ అతడి పరపతి మరింత పెరిగింది. 2011లో సిరియాతో జరిగిన అంతర్యుద్ధంలో హెజ్బొల్లా దళాలు బషర్ అల్-అసద్ దళాలతో చేతులు కలిపాయి. ఈ చర్య అరబ్ దేశాల్లో అతడి కీర్తిని తగ్గించినప్పటికీ, ఇరాన్‌తో మాత్రం సంబంధాలు పటిష్టం చేశాయి.