న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా నియమితులైన మొజ్తబా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభమైన తొలి రోజునే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సైన్యం, దౌత్యంపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) పిడివాదులు పట్టు బిగించగా మితవాదులను పక్కకు తప్పించినట్లు న్యూయార్క్ పోస్టు వార్తా కథనం పేర్కొంది. ఐఆర్జీసీ కమాండర్ మేజర్ జనరల్ అహ్మద్ వహీదీ, ఆయన ఆంతరంగిక బృందం ఇరాన్ నాయకత్వాన్ని చేపట్టినట్లు తెలుస్తున్నది. హొర్ముజ్ జలసంధిలో ఇటీవల పెరిగిన ఉద్రిక్తతలు, అమెరికాతో జరగాల్సి ఉన్న రెండో విడత శాంతి చర్చలను విస్మరించాలని ఇరాన్ తీసుకున్న నిర్ణయం అంతర్గత అధికార బదిలీని సూచిస్తున్నట్లు పత్రిక పేర్కొంది.
విదేశీ వ్యవహారాల మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వంటి ఉదారవాద నాయకులను పక్కకు తప్పించినట్లు కనపడుతున్నదని వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీ ఆఫ్ వార్ పేర్కొన్నట్లు పత్రిక తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంతో చర్చల అనంతరం హొర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా తెరువడానికి అరాఘ్చీ అంగీకరించగా ఇరాన్ ఓట రేవులను అడ్డుకుంటున్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి జలసంధిని మూసే ఉంచాలని ఐఆర్జీసీ ఒత్తిడి తీసుకువచ్చి అమలు చేయడమే ఇరాన్ నాయకత్వ మార్పునకు నిదర్శనమని పత్రిక తెలిపింది. నిర్ణయాలు తీసుకోవడంలో మొజ్తబా ఖమేనీతోపాటు వహీదీ ఇప్పుడు ముఖ్యమైన నేతగా మారిపోయారని న్యూయార్క్ పోస్టు పేర్కొంది. పశ్చిమ దేశాల పట్ల వ్యతిరేక వైఖరిని కలిగినప్పటికీ అరాఘ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘలీబాఫ్ వంటి నాయకులపై ఉదారవాదులనే ముద్ర ఉందని, ఈ కారణంగానే పిడివాదులుగా పేరు పొందిన వహీదీ వంటి ఐఆర్జీసీ నాయకులు ఇప్పుడు సైనిక, దౌత్య వ్యవస్థలను తమ నియంత్రణలోకి తీసుకున్నారని పత్రిక తెలిపింది.