Strait of Hormuz : ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్ మళ్లీ హార్ముజ్‌ను మూసేసింది. దీనికి కారణం ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరపడమే ఇందుకు కారణం. శనివారం కూడా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిచేసింది. అమెరికాతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి, ఇజ్రాయెల్ దాడులు చేసినందుకే హార్ముజ్‌ను మూసేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ జాయింట్ మిలిటరీ టాప్ కమాండ్ అయిన ఖతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రకటించింది.
అంతేకాదు.. ఇజ్రాయెల్ చర్యలపై ఇది ప్రాథమిక స్పందన మాత్రమే అని, ఇకపై దాడులు ఆపకుంటే, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ నిర్ణయం ప్రపంచానికి షాకింగే. ముఖ్యంగా పశ్చిమాసియాపై ఇరాన్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇరాన్ నిర్ణయంతో అక్కడి నౌకల కదలికలు నిలిచిపోయాయి. లెబనాన్‌పై శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 16 మంది మరనించారు. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతకుముందే శుక్రవారం ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అటు అమెరికా, ఇరాన్ మధ్య, ఇటు లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ.. ఇజ్రాయెల్ శనివారం డ్రోన్లతో దాడి చేయడం సంచలనంగా మారింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై అమెరికా కూడా అసహనం వ్యక్తం చేస్తోంది.
శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా దాడులు చేయడాన్ని తప్పుబడుతోంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కీలక సూచన చేశారు. నెతన్యాహు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నెతన్యాహు తనకు చాలా మంచి మిత్రుడు అని, అయితే, ఆయన చర్యలను అడ్డుకోక తప్పదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజాగా హార్ముజ్‌ను మూసేస్తూ ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.