Strait Of Hormuz : ప్రపంచానికి ఇరాన్ మరోసారి షాకిచ్చింది. హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే తిరిగి మూసేసింది. అమెరికా అనుసరిస్తు్న్న విధానమే దీనికి కారణమని ఆరోపించింది. హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఇటీవల హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరిచినప్పటికీ, అమెరికా మాత్రం ఈ దిగ్బంధనాన్ని తొలగించలేదు. పైగా తమ నౌకల్ని అమెరికా అడ్డుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దిగ్బంధనం పేరుతో సముద్రంపై అమెరికా దోపిడీ, దౌర్జన్యానికి పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు హార్ముజ్‌ను తెరిచామని, అయితే, ఈ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ విమర్శించింది. హార్ముజ్‌ను ఇరాన్ తిరిగి మూసివేడయంతో మళ్లీ గతంలోలాగే ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ పూర్తి పర్యవేక్షణ చేపడుతోంది. సముద్ర జలాలపై గట్టి నిఘా ఉంటుందని తెలిపింది. ఇరాన్ నిర్ణయంతో ఈ జలసంధి నుంచి నౌకల రవాణా నెమ్మదించింది. హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధించినంతకాలం తాము జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ ప్రకటించింది. అయితే, ఈ విషయంలో అమెరికా వైఖరి భిన్నంగా ఉంది. తమతో ఒప్పందం కుదుర్చుకునే వరకు హార్ముజ్ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఇదే సమయంలో ఇరాన్ తమ దేశంలోని పలు ఎయిర్‌పోర్టులను తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు మార్గంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుగుణంగా అనుమతులిస్తున్నట్లు ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. హార్ముజ్‌కు సంబంధించి.. దీన్ని ఇంకొంతకాలం ఇలాగే మూసి ఉంచితే ప్రపంచం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. చమురు ధరలు కూడా భారీగా పెరుగుతాయి.