ఇస్తాంబుల్, జూన్ 22: ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులకు దిగటం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. అమెరికా దాడుల నుంచి తమను తాము కాపాడుకోగలమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. ఆదివారం ఇస్తాంబుల్‌లో మీడియాతో మాట్లాడుతూ, తాను వెంటనే మాస్కోకు వెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవుతానని ప్రకటించారు.
అమెరికాది ద్రోహపూరిత దౌత్యమని ఆరోపించారు. ఇకపై ఆ దేశంతో ఇరాన్ ఎలాంటి దౌత్యపరమైన చర్చలూ జరపబోదని ప్రకటించారు. అయితే ఇరాన్‌కు రష్యాను మిత్ర దేశంగా పేర్కొన్నారు. మాస్కోకు బయల్దేరి వెళ్తున్నానని, సోమవారం పుతిన్‌తో సమావేశమై చర్చలు జరుపుతానని అన్నారు. మరోవైపు, అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు ఇరాన్‌కు అణు వార్హెడ్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.