Iranian oil : చైనాకు మళ్లిన భారత చమురు నౌక ఇప్పుడు ఇండియాకు తిరిగి రాబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇరాన్ నుంచి వస్తున్న చమురు నౌక కావడం విశేషం. భారత చమురు కష్టాలు త్వరలో తీరే అవకాశాలున్నాయి. ఇరాన్ నుంచి చమురు ఇండియాకు రానుంది. ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురును ఇండియా దిగుమతి చేసుకోబోతుంది. ఇరాన్ క్రూడాయిల్ కలిగిన జయ అనే నౌక ఇండియాలోని తూర్పు తీర ప్రాంతానికి రాబోతుంది. ఈ విషయాన్ని లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, కెప్లర్ సంస్థలు ధృవీకరించాయి.
ఈ సంస్థలు సముద్రంలోని వాణిజ్య నౌకల్ని ట్రాక్ చేస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం ఇరాన్ నుంచి బయల్దేరిన ఈ నౌక గత వారమే ఇండియాకు రావాల్సింది. కానీ, దారి మళ్లించుకుని చైనా వైపు కదిలింది. అంతకుమించి ఈ నౌక గురించి ఏ సమాచారం లేదు. కానీ, ఇప్పుడు ఈ నౌక ఇండియా వైపు తిరిగి వస్తున్నట్లు నౌకలకు సంబంధించిన ట్రాఫికింగ్ డాటా వెల్లడించింది. ఈ నౌకలోని చమురును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థ కొనుగోలు చేసింది. ఈ నౌకతోపాటు జోర్డాన్ అనే మరో నౌక కూడా ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి చమురు రానుండటం ఏడేళ్లతర్వాత ఇదే తొలిసారి. గతంలో ఇరాన్ నుంచి ఇండియా భారీగా చమురును కొనుగోలు చేసేది. కానీ, అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు కొనుగోలును ఇండియా ఆపేసింది. చివరగా మే, 2019లో ఇరాన్ నుంచి ఇండియా చమురు కొనుగోలు చేసింది.
అయితే, ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అది కూడా నెలరోజులపాటు వెసలుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఇండియా చమురు కొంటోంది. ఇరాన్ యుద్ధం కారణంగా, హార్ముజ్ జలసంధి మూసేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల చమురు నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. అయితే, ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హార్ముజ్ జలసంధి తెరుచుకోనుంది. ఇదే జరిగితే మరింత చమురు అందుబాటులోకి వస్తుంది.