Owaisi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్తాన్ సిఫారసు చేయడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదంలో అమెరికా ప్రవేశించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాకిస్తాన్ ట్రంప్‌ను శాంతి పురస్కారానికి సిఫారు చేసింది అందుకేనా? అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడితో భోజనం చేసింది అందుకేనా? ఈరోజు అవన్నీ బహిర్గతమయ్యాయి’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడి చేయడాన్ని ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, యూఎస్ చార్టర్‌ను ఉల్లంఘించడమేనన్నారు.
ఇలా చేయడం ద్వారా రాబోయే ఐదేళ్లలో ఇరాన్ అణ్వస్త్ర దేశంగా మారుతుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానన్నారు. ప్రస్తుతం చాలా గల్ఫ్ దేశాలు సైతం తమకు అణ్వాయుధ సామర్థ్యం అవసరమని భావిస్తాయన్నారు. 16 మిలియన్లకుపైగా భారతీయులు గల్ఫ్, మధ్యప్రాశ్చంలో నివసిస్తున్నారని మనం గుర్తుంచుకోవాలన్నారు. ఆ ప్రాంతంలో యుద్ధం జరిగితే.. దురదృష్టవశాత్తు అది జరిగే అవకాశం ఉందని.. అది అక్కడ నివసిస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలన్నింటిలో భారతీయ కంపెనీల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుంచే వస్తాయన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయనేది కేవలం పుకారేనన్నారు. అమెరికా చేసిన ఈ దాడి పాలస్తీనియన్లను ఊచకోత కోయబోతున్న నెతన్యాహుకు సహాయపడిందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
గాజాలో జాతి విధ్వంసం జరుగుతోందని.. అమెరికా దాని గురించి ఆందోళన చెందడం లేదని.. ఇజ్రాయెల్ ప్రభుత్వ నేరాలను దాచడమే అమెరికా విధానమన్నారు. గాజాలో జరుగుతున్నది జాతి విధ్వంసం గురించి ఎవరూ మాట్లాడడం లేదని.. ఇజ్రాయెల్‌లో ఎన్ని అణు నిల్వలు ఉన్నాయో ఎవరూ ఎందుకు అడగడం లేదు? ప్రశ్నించారు. అమెరికా ఇక్కడితోనే ఆగదని.. తన మాటలను గుర్తించాలన్నారు. రాబోయే ఐదు పదేళ్లలో ఇరాన్ సైతం ఇదే చేస్తుందని.. ఇతర దేశాలు సహాయం అందిస్తాయన్నారు. అణుబాంబులు, అణ్వాయుధాలు కలిగి ఉండడం ఇజ్రాయెల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక నిరోధకమని ఇప్పుడు గ్రహించిందని.. అంతర్జాతీయ చట్టాన్ని, యూఎన్ చార్టర్‌ను ఉల్లంఘించే అమెరికా ఈ ఏకపక్ష బాంబు దాడిని భారత ప్రభుత్వం ఖండిస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు.