టెహ్రాన్, మే 21: శుద్ధి చేసిన యురేనియం నిల్వలకు సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంలోని యురేనియం నిల్వలను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఖమేనీ చేసిన ఈ ప్రకటన అమెరికా-ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. అణ్వాయుధ తయారీకి సమీప స్థాయిలో ఉన్న యురేనియం నిల్వలు తప్పనిసరిగా దేశంలోనే ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశం ద్వారా ఖమేనీ శాంతి చర్చలకు ఒక లక్ష్మణ రేఖను గీశారని వార్తలు వస్తున్నాయి. ఇది అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలను మరింత పెంచింది.
అంతేకాకుండా యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరింత అసహనానికి గురి చేయవచ్చునని భావిస్తున్నారు. యురేనియం నిల్వలను విదేశాలకు తరలిస్తే భవిష్యత్‌లో అమెరికా, ఇజ్రాయెల్ చేసే దాడులతో పరిస్థితి మరింత దుర్భరమవుతుందని తమ దేశం భయపడుతున్నదని, అందుకే యురేనియం తొలగింపుపై అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్‌ను తిరస్కరిస్తూ యురేనియం నిల్వలను తరలించే ప్రసక్తి లేదంటూ ఖమేనీ ప్రకటించారని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
ఇరాన్‌తో సాగుతున్న యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్ ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి! ఇరాన్‌పై ఎలా ముందుకు పోదాం.. అన్నదానిపై అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మంగళవారం ఫోన్ కాల్లో చర్చించుకున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తో నెతన్యాహు సంభాషణ చాలా వాడీవేడిగా సాగినట్టు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.