Death Sentence | ఇరాన్‌కు చెందిన ప్రముఖ రచయిత మెహదీ బహ్మాన్కు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఇటీవల ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ఆయనను ఛానల్ కార్యాలయంలోనే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలపై ఆయనను విచారించి శిక్ష విధించినట్లు ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. హిజాబ్ వ్యతిరేక నిరసనల మధ్య రచయితకు మరణశిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ రచయిత మెహదీ బహ్మాన్ ఇటీవల ఇజ్రాయెల్ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే బహ్మాన్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. మెహదీ బహ్మాన్ ఇరాన్లో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయడాన్ని తన ఇంటర్వ్యూలో తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సంబంధాలను సరిదిద్దాలని కూడా పట్టుబట్టాడు. మెహదీ బహ్మాన్ ఇంటర్వ్యూ గత ఏడాది ఏప్రిల్‌లో రికార్డు చేయగా.. ఇటీవల హిజాబ్ ఆందోళనలు ఉద్ధృతమైన వేళ దీన్ని ప్రసారం చేశారు. ఇది హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు చేపడుతున్నవారిని మరింత ఆగ్రహానికి గురిచేసింది.
మెహదీ బహ్మాన్ ఇరాన్ ప్రసిద్ధ రచయిత. వివిధ మతాలకు సంబంధించిన కళాఖండాలపై షియా మతాధికారి మసౌమీ టెహ్రానీతో కలిసి ఈయన పనిచేశాడు. కాగా మెహదీ బహ్మాన్ గూఢచర్యానికి పాల్పడినట్లు ఇరాన్ ప్రభుత్వం ఆరోపించింది. ఇరాన్లో సెప్టెంబర్ 22 న మహాసా అమిని చనిపోయిన తర్వాత నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ ప్రదర్శనల్లో ఇప్పటివరకు 69 మంది చిన్నారులు సహా 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇరాన్ ఇప్పటివరకు 26 మందికి మరణశిక్ష విధించినట్లు ఆమ్నెస్టీ తన నివేదికలో తెలిపింది.