Iran : భారత నౌకలపై ఇటీవల హార్ముజ్ జలసంధి వద్ద జరిగిన దాడిపై ఇరాన్, అమెరికా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ దాడికి కారణం ఇరాన్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. తాము ఈ దాడులకు పాల్పడలేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ ప్రకటించింది. ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం శనివారం ఈ ప్రకటన చేసింది.
భారత నౌకలపై దాడి చేసింది అమెరికాయే అని ఇరాన్ వ్యాఖ్యానించింది. వాణిజ్య నౌకలపై దాడి చేసిన యూఎస్ ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఇరాన్‌పై ఆరోపణలు చేస్తోందని, ముగ్గురు భారతీయుల మృతికి అమెరికానే కారణమని వెల్లడించింది. అమెరికా చర్యలు క్రూరత్వం, అమానవీయమైనవని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో ఇటీవల వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్ని కూడా ఇటీవల ఇరాన్ ఖండించింది. ఈ దాడులకు అమెరికానే కారణమని ఆరోపించింది. ఈ నెల 8న హార్ముజ్ జలసంధి వద్ద, ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి సమయంలో నౌకలో 24 మంది ఉండగా, వీరిలో 21 మందిని సహాయక బృందాలు రక్షించాయి.
మరో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మరోసారి గత బుధవారం రాత్రి కూడా భారత వాణిజ్య నౌకలపై దాడి జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. కానీ, డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా రాయబారికి రెండుసార్లు సమన్లు జారీ చేసింది.