టెహ్రాన్ : హొర్ముజ్ జలసంధిలో నౌకలపై సేవా రుసుము వసూలు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోందని ఆ దేశ రాయబారి అబ్దుల్‌రెజా రెహమాన్ ఫాజ్లి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో శనివారం జరిగిన ప్రపంచ శాంతి సదస్సులో ఆయన మాట్లాడుతూ.. యుద్ధ సమయంలో ఇరాన్‌కు అండగా నిలిచిన దేశాలకు మాత్రం సేవా రుసుములో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఒమన్‌తో కలిసి ఇరాన్ హొర్ముజ్‌లో నౌకల రవాణాపై ఏర్పాట్లు చేస్తోందన్నారు. ‘హొర్ముజ్ మా దేశంలో అంతర్భాగం. కాబట్టి మేం కచ్చితంగా సేవా రుసుము వసూలు చేస్తాం.
ఇది టోల్ కాదు. జలసంధి గుండా నౌకలు సులభంగా వెళ్లేందుకు చేస్తున్న ఏర్పాట్లకు, ట్రాఫిక్‌ను నియంత్రించినందుకు మేం తీసుకుంటున్న సర్వీస్ ట్యాక్స్’ అని అబ్దుల్ వెల్లడించారు. హొర్ముజ్‌లో ఎలాంటి టోల్ వసూలు చేయొద్దని అమెరికా షరతు పెట్టినా సరే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. 60 రోజుల పాటు ఎలాంటి టోల్ వసూలు చేయొద్దని ఇరాన్-యూఎస్ ఒప్పందంలో ఉంది. ఆ తర్వాత ఏమైనా ట్యాక్సులు ఉంటాయా అని ప్రపంచం ఆందోళన చెందుతున్న వేళ.. అబ్దుల్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.