టెహ్రాన్, సెప్టెంబర్ 6: తమ దేశంపై ‘అక్టోబర్ 7’ తరహా దాడికి ఇరాన్ వ్యూహం పన్నుతున్నట్టు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయట. అన్ని వైపుల నుంచి ఏకకాలంలో దాడులు చేసేలా ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నదని, లెబనాన్‌లోని హెజ్బొల్లా, గాజాలోని హమాస్, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలీషియాలతో కలిసి బహుముఖ దాడులు చేపట్టాలన్నది ఇరాన్ వ్యూహంగా ఉందని ‘జెరూసలేం పోస్ట్’ వార్తా కథనం పేర్కొన్నది.
ఒకే సమయంలో అన్ని వైపుల నుండి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ లక్ష్యంగా ఉన్నట్టు తెలిపింది. ఇందుకోసంగాను తన ప్రాంతీయ మిత్రపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఇరాన్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నదట. ఇజ్రాయెల్‌పై ఒకేసారి పెద్ద ఎత్తున విరుచుకుపడాలన్నది టెహ్రాన్ నాయకత్వం ఆలోచనగా ఉందట. ‘సంయుక్త దాడుల్లో ఇరాన్ తన సొంత బలగాలతోపాటు హెజ్బుల్లా, హమాస్, హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్ మిలీషియాలను భాగం చేయాలని చూస్తున్నది. ఇరాన్ ఖుద్స్ దళానికి చెందిన ఉన్నతాధికారులు హెజ్బుల్లా, హౌతీలు, ఇరాకీ మిలీషియా కమాండర్లతో చర్చలు జరిపారు’ అని ఇజ్రాయెల్ నిఘా వర్గాల్ని ఉటంకిస్తూ వార్తా కథనం విడుదలైంది.