టెహ్రాన్: హోర్ముజ్‌పై డీల్ కుదుర్చుకోకపోతే ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లను పేల్చివేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారి ఒకరు ఆ దేశ యువతకు పిలుపునిచ్చారు. పవర్ ప్లాంట్ల వద్ద ఇవాళ మానవహారాల(Iran Human Chains)ను ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోని యువత అంతా పవర్ ప్లాంట్ల వద్దకు చేరుకోవాలన్నారు. ట్రంప్ బెదిరింపులకు కౌంటర్‌గా మానవగొలుసులను ఏర్పాటు చేయాలని ఇరాన్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యూత్ అండ్ అడలోసెంట్ కార్యదర్శి అలీరెజా రహిమి పేర్కొన్నారు. అలీరెజా చేసిన వ్యాఖ్యలకు చెందిన వీడియోను రిలీజ్ చేశారు. యువకులు, అథ్లెట్లు, ఆర్టిస్టులు, విద్యార్థులు, యూనివర్సిటీ స్టూడెంట్స్, ప్రొఫెసర్లు అందరూ పవర్ ప్లాంట్ల వద్దకు చేరుకోవాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అందరూ రావాలన్నారు. పవర్ ప్లాంట్లు మన దేశ ఆస్తులు అని, అవే మన పెట్టుబడి అని పేర్కొన్నారు. ఇరాన్ భవిష్యత్తు కోసం యువత కదిలిరావాలన్నారు. గతంలో పశ్చిమ దేశాలతో వైరం నెలకొన్న సమయంలో.. నిరసన ప్రదర్శనల్లో భాగంగా ఇరానీ యువత తమ న్యూక్లియర్ కేంద్రాల వల్ల మానవహారాలను ఏర్పాటు చేశారు.